Friday, November 15, 2024

తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు

- Advertisement -
- Advertisement -

47.26 లక్షల ఖాతాల్లోకి నిధుల కేటాయింపు
కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి వివరణ
38114 Crores mudra loans sanctioned in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేశామని, ఆ మొత్తం 47,26,819 ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ తెలిపారు. పిఎంఎంవైలో భాగంగా శిశు, కిషోర్ మరియు తరుణ్ పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని ‘ముద్ర’ నిధులు మంజూరయ్యాయి? కేటగిరీల వారీగా పథకం ద్వారా లబ్ది పొందని లబ్దిదారుల వివరాలు, ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సోమవారం పార్లమెంట్‌లో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2015 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని, నాటి నుండి నేటి వరకు దేశ వ్యాప్తంగా రూ.15.52 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు.

వీటి వల్ల 29.55 కోట్ల మందికి రుణాలు అందాయన్నారు. వీటిలో 5.20 లక్షల కోట్ల రూపాయల మేరకు రుణాలు 6.90 కోట్ల కొత్త పారిశ్రామికవేత్తల ఖాతాల్లోకి విస్తరించబడ్డాయని వివరించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) కింద సూక్ష్మ/చిన్న వ్యాపార యూనిట్ల వ్యవస్థాపక కార్యకలాపాల కోసం రూ.50 వేల నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఉత్పత్తి, వ్యాపారం, సేవలతో పాటువ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు వంటి రంగాలలో ఆదాయాన్ని సృష్టించేందుకు ఈ పతకం ఎంతగానో షహాయపడుతుందని తెలిపారు.

శిశు పథకం కింద రూ.50 వేలు, కిషోర్ పథకం కింద రూ.5 లక్షలు, తరుణ్ పథకం కింద రూ.10 లక్షల లోపు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిధులు విడుదల చేయకపోవడం, ఇతర ఫిర్యాదులు వంటి సమస్యలు వస్తే సంబంధిత బ్యాంకుల సమనర్వయంతో వాటిని పరిష్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేల లోపు (శిశు పథకం) రుణాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.5 లక్షల లోపు (కిషోర్ పథకం) రుణాలు తీసుకున్న వారు 7,94.913 మంది రూ.10 లక్షల లోపు (తరుణ్ పథకం) రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1,85.886 మంది ఉన్నట్లు వివరించారు.

వ్యవసాయ, వాణిజ్య, ఉత్పత్తి, సేవల రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద వేలాది కోట్ల రుణాలను మంజూరు చేసి లక్షలాది మందికి లబ్ది చేకూరుస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News