బిజెపి నుంచి 19మంది, శివసేన 11, ఎన్‌సిపి నుంచి 9మందికి చోటు
ముంబై : మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని ‘మహాయుతి’ ప్రభుత్వంలో ఆదివారంనాడు కొత్తగా 39 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బిజెపి నుంచి 19 మంది, షిండే శివసేన నుంచి 11 మంది, ఎన్‌సిపి నుంచి 9మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.
డిసెంబర్ 5న ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రులుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేశారు. అనంతరం తొలిసారి ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగింది. బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, రాధాకృష్ణ విఖే పాటిల్, ఆశిష్ షెలార్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, గణేష్ నాయక్, మంగళ్ ప్రతాప్ లోథా, జయకుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
షిండే శివసేన నుంచి దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సంజయ్ రాథోడ్, గులాబ్‌రావు పాటిల్, ఉదయ్ సామంత్ ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అజిత్ పవార్ ఎన్‌సీపీ నుంచి మాణిక్రావు కోకటే, దత్తాత్రేయ్ విఠోభా భర్నే, హసన్ ముష్రిఫ్, అదితి సునీల్ టట్కరే, ధనంజయ్ ముండే ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఆయా పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు.