Saturday, November 23, 2024

‘టీకా’ విజయ ఢంకా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా టీకా సక్సెస్
తొలిరోజు 140 కేంద్రాలలో టీకా కార్యక్రమం నిర్వహణ

నమోదు చేసుకున్న 4,296 మందిలో 3,962 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్
కేవలం 11మందిలో టీకా అనంతర స్వల్ప సమస్యలు, టీకా వేయించుకున్న వాళ్లూ
జాగ్రత్తలు కొనసాగించాలి : డా. శ్రీనివాస్‌రావు
బిపి ఉన్న వాళ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారు : డిఎంఇ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి రోజు వ్యాక్సిన్ పంపిణీ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 140 సెంటర్లలో 3962 మంది హెల్త్ కేర్ వర్కర్లకు టీకా ఇచ్చారు. వీరిలో కేవలం 11 మందికి మాత్రమే దద్దుర్లు, చేతినొప్పి, టీకా వేసిన చోట చర్మం ఎర్రగా మారడం, కళ్లు తిరగడం, వాంతులు చేసుకోవడం వంటివి జరిగాయి. అయితే ఇవి కేవలం నిమిషాల వ్యవధిలోనే తగ్గిపోయాయి. ఉదయం 10.30 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే గాంధీ హాస్పిటల్‌లో అక్కడ పనిచేసే శానిటేషన్ వర్కర్ కృష్ణమ్మ తొలి టీకా తీసుకున్నారు. అంతేగాక నార్సింగ్ పిహెచ్‌సిలో జయమ్మ, తిలక్‌నగర్ పిహెచ్‌సిలో రేణుకలకు కొవిషీల్డ్ మొదటి డోసులను వేశారు. మిగతా సెంటర్లలోనూ తొలి టీకాలను శానిటేషన్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులకు ప్రయారిటీ ఇచ్చారు. ఈ సెక్టార్‌కి చెందిన సిబ్బంది అందుబాటులో లేని దగ్గర అదే ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు, ఇతర సహాయక సిబ్బందిలు వ్యాక్సిన్ వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలి రోజు వ్యాక్సినేషన్ ముగించడం గమనార్హం. అన్ని జిల్లాల్లో సుమారు 90 శాతం మంది హెల్త్ కేర్ వర్కర్లు స్చచ్ఛందంగా టీకాను తీసుకున్నారని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా శనివారం జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేవలం 104 కేంద్రాల్లో మాత్రమే కొవిన్ ఆన్‌లైన్ విధానంలో టీకా పంపిణీ జరుగగా, మిగతా వాటిలో మ్యాన్‌వల్‌గా నిర్వహించారు. అయితే 16 జిల్లాల్లో 100 శాతం లక్షం చేరుకోగా, మరో 16 జిల్లాల్లో 85 శాతం పంపిణీ జరిగింది. కానీ కామారెడ్డి జిల్లాల్లో అనుకున్న లక్షం కంటే రెట్టింపు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. మరోవైపు మొదటి రోజు అత్యవసర సిబ్బందికెవ్వరికీ డోసులు ఇవ్వలేదు. ఎవరికైన సమస్యలు ఉత్పన్నమైతే స్టాఫ్ కొరత ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతోనే ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.
టీకా పంపిణీలో ప్రముఖులు….
కరోనాకు కళ్లేం వేసేందుకు ప్రారంభించిన టీకా పంపిణీలో అధికారులతో పాటు ప్రముఖులూ పాల్గొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో గవర్నర్ తమిళిసై, గాంధీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్, డిఎంఇ డా రమేష్‌రెడ్డి, ఐపిఎం డైరెక్టర్ డా శంకర్, టిమ్స్ డైరెక్టర్ విమలా థామస్, తిలక్‌నగర్ పిహెచ్‌సిలో మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఏ ముఠా గోపాల్ అంబర్ పేట్ ఎంఎల్‌ఏ కాలేరు వెంకటేష్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నార్సింగ్ పిహెచ్‌సిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్‌రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొని టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పాటు మిగతా జిల్లాల్లో ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు తొలి రోజు వ్యాక్సినేషన్‌లో పాల్గొని ప్రజల్లో మనోధైర్యం పెంచారు.
మొదటి రోజు సెంటర్ల వారీగా తీసుకున్న వారి సంఖ్య….
ఆదిలాబాద్ జిల్లాలోని 3 సెంటర్లలో 90 మంది హెల్త్ కేర్ వర్కర్లు టీకా తీసుకోగా, భద్రాద్రి కొత్తగూడెంలో 113, హైదరాబాద్‌లో 417, జగిత్యాలలో 38, జనగాం 60, భూపాలపల్లి 90, గద్వాల 120, కామారెడ్డి 175, కరీంనగర్ 120, ఖమ్మం 170, ఆసిఫాబాద్ 90, మహబూబాబాద్ 115, మహబూబ్‌నగర్ 120, మంచిర్యాల 60, మెదక్ 40, మల్కాజ్‌గిరి 295,ములుగు 40, నాగర్‌కర్నూల్ 60, నల్గొండ 83, నారాయణపేట్ 77, నిర్మల్‌లో 90, నిజామాబాద్ 180, పెద్దపల్లి 90, సిరిసిల్లా 120, రంగారెడ్డి 235, సంగారెడ్డి 144, సిద్ధిపేట్ 66, సూర్యాపేట్ 80, వికారాబాద్ 90, వనపర్తి 120, వరంగల్ రూరల్ 104, వరంగల్ అర్బన్ 180, యాదాద్రి భువనగిరిలో 90 మంది టీకాను తీసుకున్నారు. వాస్తవంగా ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకాను ఇవ్వాలని అధికారులు లక్షం పెట్టుకొగా, కొన్ని కేంద్రాలు మినహా ఎన్‌రోల్ చేసుకున్న లబ్ధిదారులంతా టీకా తీసుకున్నారు.
క్రమక్రమంగా కేంద్రాలు పెంపు….
రాష్ట్రంలో తొలి రోజు టీకా పంపిణీ సజావుగా జరగడంతో సోమవారం నుంచి 500 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాను ఇచ్చేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇలా క్రమక్రమంగా పెంచుకుంటూ 1213 సెంటర్లలో టీకా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. వీటిలో 178 ప్రైవేట్ కేంద్రాలూ ఉన్నాయి. వీటిలోనూ అతి త్వరలోనే టీకా పంపిణీ జరుగుతుందని వైద్యశాఖ వెల్లడించింది. అయితే టీకా తీసుకున్న వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా 104కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేగాక తమ సిబ్బంది కూడా మరిన్ని రోజులు టీకా తీసుకునోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటారని ఆరోగ్యశాఖ పేర్కొంది.
టీకా తీసుకునోళ్లూ జాగ్రత్తలు తీసుకోవాలిః డిహెచ్ డా జి శ్రీనివాసరావు
రాష్ట్రంలో టీకా తీసుకునోళ్లూ మరిన్ని రోజులు జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో తోలి రోజు వ్యాక్సినేషన్ సక్సెస్ అయిన సందర్బంగా ఆయన డిఎంఇ డా రమేష్‌రెడ్డితో కలసి కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా డిహెచ్ మాట్లాడుతూ..తొలి రోజు టీకా తీసుకున్న వారు మరో రెండ్రోజుల పాటు అలవాటు లేని ఆహారాన్ని తీసుకొవద్దని సూచించారు. అంతేగాక ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలన్నారు. అదే విధంగా ఫీవర్, మైనర్ సమస్యలు వచ్చినప్పటికీ అవి సాధరణమేనని అన్నారు. వాటిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.దేశ వ్యాప్తంగా తొలిసారి ఆన్‌లైన్ విధానంలో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. గత ఏడాది నుంచి శ్రమించిన కష్టానికి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈమేరకు తనకు సహకరించిన సిఎం కెసిఆర్, మంత్రి ఈటల రాజేందర్‌లులతో పాటు హెల్త్ కేర్ వర్కర్లకు కృతజ్ఞతుడై ఉంటానని ఆయన అన్నారు. ఇక జనరల్ పబ్లిక్ వ్యాక్సినేషన్‌పై మరో రెండ్రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టత రానుందని ఆయన వెల్లడించారు.
హైపర్ టెన్షన్ ఉన్న వాళ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారు:డిఎంఇ డా రమేశ్‌రెడ్డి
తొలి రోజు హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఉన్న వారూ వ్యాక్సిన్ తీసుకున్నారని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. తొలి రోజు లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి రీయాక్షన్లు తేలలేదన్నారు. ప్రజల్లో భయాందోళనను పొగొట్టేందుకే తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్పారు. దీన్ని ఎలాంటి భయాందోళన లేకుండా వేసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇమ్యూనిటీతో పాటు యంటీబాడీలు డెవలప్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే తాను తొలి రోజు వ్యాక్సిన్ తీసుకోగానే తనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయన్నారు. కనీసం నొప్పి కూడా కలుగలేదన్నారు. వ్యాక్సిన్ తీసుకుంటేనే కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేయొచ్చని పేర్కొన్నారు.
టీకాలు భవిష్యత్‌కు ఆశాకిరణం: మంత్రి కెటిఆర్
టీకాలు భవిష్యత్‌కు ఆశాకిరణంగా మారతాయని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంగా ప్రజలు పడ్డ ఇబ్బందులకు చరమగీతం పడే అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. తిలక్‌నగర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన శనివారం ముఖ్య అతిధిగా వచ్చేశారు. ఈసందర్బంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..మనకు వచ్చిన టీకాలు సురక్షితంగా ఉన్నాయని, ఎవరూ ఎలాంటి ఆందోళను చేందాల్సిన అవసరం లేదన్నారు. వాస్తవానికి ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు ప్రజాప్రతినిధులంతా ముందుకు వచ్చినప్పటికీ పిఎం మోడీ సూచన మేరకు తాము తొలి రోజు టీకాను తీసుకోలేదన్నారు. అయితే కేంద్రం ఎప్పుడూ అనుమతి ఇస్తే అప్పుడూ తీసుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ హబ్‌గా మారిందని ఆయన తెలిపారు. గతేడాది నుంచి ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
కనబడని ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌తో చరమగీతం పాడొచ్చు: మంత్రి ఈటల
కంటికి కనబడని కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌తో చరమగీతం పాడొచ్చని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తొలి రోజు గాంధీలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ…కొవిన్‌లో ఎంట్రీ అయిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించే ముందు ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. అయితే ఎంతో మంది హెల్త్ కేర్ వర్కర్లు ప్రజలకు చికిత్సను అందిస్తూ ప్రాణాలు కొల్పోవడం బాధకరమన్నారు. అందుకే తొలి ప్రయారిటీ వాళ్లకు ఇచ్చమన్నారు. ప్రస్తుతానికి మన దేశం వ్యాక్సిన్ ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందన్నారు. వ్యాక్సినేషన్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియని తెలిపారు.
కొవిడ్ వ్యాక్సిన్ దేశానికే గర్వకారణం: గవర్నర్ తమిళి సై
కొవిడ్ వ్యాక్సిన్ దేశానికే గర్వకారణమని గవర్నర్ తమిళిసై అన్నారు. తొలి రోజు తాను తీసుకోవాలని భావించినప్పటికీ మొదట ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్న ప్రధాని సూచన మేరకు తీసుకోలేదన్నారు. నిమ్స్‌లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆమె శనివారం హజరయ్యారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌తో కొవిడ్‌కు ముగింపు పలుకవచ్చని ఆమె అన్నారు. ఇన్నాళ్లు కష్టపడ్డ ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం ఏ దేశంపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆమె కోరారు.
మన దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ప్రపంచంలో నాలుగు దేశాలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుండగా, అందులో మన దేశానికి చెందిన రెండు సంస్థలు ఉండటం గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం గాంధీలో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కరోనాతో బాధపడ్డారని, ఇక నుంచి ఆ సమస్యలు పోనున్నట్లు ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తొలి విడత మూడు కోట్ల మంది కరోనా వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. అయితే దేశ వ్యాప్తంగా అతి త్వరలో అందరికి టీకా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. టీకాను తయారు చేసిన సైంటిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.

3962 People Vaccinated on Day 1 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News