Monday, December 23, 2024

ఆరు నెలలు… 4.90లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

4.90 lakh Without helmets cases in six months

హెల్మెట్ కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోవడంలేదు
పిలియన్ రైడర్లపై 2.54లక్షల కేసులు నమోదు

హైదరాబాద్: బైక్ రైడర్లు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నా వాహనదారులు పట్టించుకోవడంలేదు. దీంతో రైడర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెటే పెట్టుకోవాలని వాహనదారులకు పోలీసులు ఎన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. అలాగే పిలియన్ రైడర్లు కూడా హెల్మెట్లు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఒక వేళా బైక్ నడుపుతున్న వారు హెల్మెట్ పెట్టుకుంటే, వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోవడంలేదు. ఇలా వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారిని పోలీసులు జరిమానాల కోసం మాత్రమే తమను ఆపుతున్నారని భావిస్తున్నారు తప్ప ప్రాణాలు కాపాడేందుకు చెబుతున్నారని వినడంలేదు. కొందరు వాహనదారులు హాఫ్ హెల్మెట్ మాత్రమే ధరిస్తున్నారు. కొందరు అసలే హెల్మెట్ ధరించడంలేదు. వారికి సిసిటివిలో చూసి ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు జరిమానాలు ఇంటికి పంపించినా మారడంలేదు. జరిమానా కూడా తక్కువ ఉండడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చాలామంది యువకులు వాహనాలపై వెళ్తుండగా హెల్మెట్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ట్రాఫిక్ పోలీసులు 4,90,866కేసులు నమోదు చేశారు. ఇందులో రైడర్లపై 2,36,458, పిలియన్ రైడర్లపై 2,54,408 కేసులు నమోదు చేశారు. గత ఏడాది తొలి ఆరునెలల్లో హెల్మెట్ పెట్టుకోని 8,42,653మందిపై కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై జరిమానా విధించారు. వాహనదారులు జరిమానాలు కట్టేందుకు సిద్ధపడుతున్నారు తప్ప తమ ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు చెబుతున్నారని మాత్రం ఆలోచించడంలేదు. సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా ఐటి ఉద్యోగులు ఉంటారు. ప్రతి రోజూ బైక్‌లపై విధులకు వచ్చిపోతుంటారు. వారిలో చాలామంది హెల్మెట్ నిబంధనలు పట్టించుకోవడంలేదు. చదువుకున్న వారు నిబంధనలు తెలిసిన వారు కూడా పాటించకపోవడంతో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

నిలువెళ్లా నిర్లక్ష్యం….
కొందరు వాహనదారులు హెల్మెట్‌ను బైక్‌కు సైడ్‌కు తగిలిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో బైక్ వెళ్తున్న ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. పులిజాలా విజయ్(30), అనిల్ కుమార్(28) ఇద్దరు బైక్‌పై అత్తాపూర్ నుంచి కాటేదాన్ వైపు వెళ్తుండగా ఆరాంఘర్ అండర్‌పాస్ వద్ద బైక్ అదుపు తప్పి ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో విజయ్ మృతిచెందాడు. వీరు హెల్మెట్‌ను ధరించకుండా బైక్‌కు సైడ్‌వైపు పెట్టుకున్నారు. హెల్మెట్ ఉన్న నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కోల్పోయేవాడు కాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. సైబరాబాద్ పరిధిలో జరగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులు హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు గాయాలై మృతిచెందుతున్నారు.

ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ధరించాలి….
వాహనదారులు స్టాండర్డ్ హెల్మెట్ ధరించాలని, నాసిరకమైన వాటిని ధరిస్తే ప్రాణాలు కోల్పోతారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నాసికరమైన హెల్మెట్‌ను కాపాడలేదని తెలిపారు. హాఫ్ హెల్మెట్, నిర్మాణ రంగంలో వాడే హెల్మెట్, ప్లాస్టిక్ క్యాప్‌లు ధరిస్తే జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ డిసిపి విజయ్‌కుమార్ హెచ్చరించారు. వాటిని హెల్మెట్ కింద పరిగణించమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News