Wednesday, January 22, 2025

బీహార్‌లో చిరు కంపన

- Advertisement -
- Advertisement -

Fuel, food crisis with Russia Ukraine war

బీహార్‌లో మూడు రోజుల క్రితం సంభవించిన ఒక పరిణామం యెంత ప్రధానమయినదో అంత అప్రధానమైనదిగా ప్రధాన వార్తా శీర్షికలకు దూరంగా ఉండిపోయింది. నిజానికి యీ సన్నివేశం ఆ రాష్ట్రంలో పెద్ద రాజకీయ ఉత్పాతానికి దారి తీసి ఉండేదే. మహారాష్ట్ర అడుగుజాడల్లో ప్రభుత్వ పతనానికి దోహదపడి వుండినా ఆశ్చర్యపడవలసి వచ్చేది కాదు. కాని అలా జరగలేదు. మొన్న జూన్ 29న బీహార్ ఎమ్‌ఐఎమ్ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్‌ఎల్‌ఎలలో నలుగురు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి)లో చేరారు. దానితో ఆర్‌జెడి బలం పెరిగి 80కి చేరడమే గాకుండా అది తిరిగి శాసనసభలో అతిపెద్ద పార్టీ అయింది. బీహార్ శాసనసభలో 243 మంది సభ్యులున్నారు. 2020లో అమిత ఉత్కంఠ భరితంగా జరిగిన యెన్నికల్లో 75 సీట్లతో ఆర్‌జెడి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 74 స్థానాలతో బిజెపి రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చెందిన జెడి(యు)కి 43, కాంగ్రెస్‌కి 19, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్ -లెనినిస్టు లిబరేషన్) కు 12, ఎమ్‌ఐఎమ్‌కు 5, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(విఐపి)కి 4, మిగతావి ఇతర చిన్న, చితక పార్టీలకు వచ్చాయి.

ఆ యెన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్‌జెడి అధికార పార్టీ కావడం ఖాయమనుకొన్నారు. బిజెపి, ఆర్‌జెడిల మధ్య హోరా హోరీ పోరు సాగింది. 19 గంటల పాటు జరిగిన వోట్ల లెక్కింపు ఉత్కంఠ కలిగించింది. బిజెపి, జెడి(యు)ల ఉమ్మడి బలంతో ఎన్‌డిఎ తిరిగి అతికష్టంగా అధికారంలోకి రాగలిగింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితమయిన ఆర్‌జెడి మాత్రం 75 స్థానాలతో అతి పెద్ద పార్టీ అయింది. ఇటీవలి వరకు యిదే పరిస్థితి కొనసాగింది. ముకేశ్ సహానీకి చెందిన వికాస్ ఇన్సాన్ పార్టీ (విఐపి) సభ్యులు ముగ్గురు గత మార్చిలో బిజెపిలో చేరడంతో దాని బలం 77 అయింది. దానితో అది శాసనసభలో అతి పెద్ద పార్టీ అయింది. ఇప్పుడు ఎమ్‌ఐఎమ్‌కి చెందిన నలుగురు సభ్యులు ఆర్‌జెడిలో చేరడంతో అంతకు ముందు వరకు 76గా వున్న దాని బలం 80 అయి దాని యేకైక అతి పెద్ద పార్టీ హోదా దానికి మళ్ళీ లభించింది. 2020 బీహార్ అసెంబ్లీ యెన్నికల తీర్పు ఆర్‌జెడిని అతి పెద్ద పార్టీ చేసినప్పటికీ అధికారంలోకి రాగలిగేటంత బలాన్ని దానికి, దాని మిత్ర కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఆశ కొద్దీ కాంగ్రెస్ యెక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తక్కువ స్థానాల్లో గెలవడంతో ఆర్‌జెడి ప్రతిపక్షంలో కూచోవలసి వచ్చింది. ఈ యెన్నికల్లో రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ద్వారా బిజెపి నడిపించిన తంత్రం జెడి(యు)ని, నితీశ్ కుమార్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. జెడి(యు) బలం దారుణంగా తగ్గిపోయింది. అప్పటి నుంచి నితీశ్‌లో బిజెపిపై వ్యతిరేకత పేరుకుపోడం మొదలయింది. ఆయన సమయం కోసం యెదురు చూస్తున్నారనే అభిప్రాయం అంతటా ఏర్పడింది.

మళ్ళీ నితీశ్‌నే ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కేంద్ర పాలకులు చాణక్యం ప్రయోగించారు. దానితో నితీశ్‌కు తల తీసి సత్కారం జరిపినట్టయింది. అందుచేత ఆయన యెన్నికల్లో బిజెపి తనను తీసిన దెబ్బను లోలోపలే భరిస్తున్నారు. ఈ మధ్య నితీశ్, తేజస్వియాదవ్‌లకు మధ్య సఖ్యత కుదరడం బీహార్ రాజకీయాలలో యెప్పుడయినా ఏమయినా జరగవచ్చనే అంచనాలకు తావిచ్చింది. వెనుకబడిన తరగతుల జనగణనను యిద్దరూ డిమాండ్ చేస్తున్నారు. బిజెపి దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నది. వెనుకబడిన తరగతుల జనాభా ఎంతో లెక్కించాలన్న డిమాండ్ చిరకాలంగా ఉన్నదే. జనాభాలో ఎవరెంతమందో విద్య, ఉద్యోగాల్లో వారికి అంత శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది ఆ వర్గాల సంఘటిత ఆకాంక్ష. బిసిల జనగణన జరిపితేనే అది సాధ్యమవుతుంది, అంటే జనాభా లెక్కలు తీసేటప్పుడు కులాలవారీగా జరిపినప్పుడే అది నెరవేరుతుంది. ఎమ్‌ఐఎమ్ సభ్యులు నలుగురు ఆర్‌జెడిలో కలవగానే బీహార్‌లో ప్రభుత్వం మారబోతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగింది. అటువంటిదేమీ లేదని చెప్పి తేజస్వి గాలి తీసేసారు. బిజెపి ముకేశ్ సహానీని ముంచేసి ఆయన పార్టీ విఐపిని తనలో కలుపుకొని (సహానీని బీహార్ మంత్రివర్గం నుంచి కూడా తరిమేశారు) అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా యెదిగిన తర్వాత మొదట్లో తన పార్టీకి గల ఆ హోదాను తిరిగి పొందడానికే ఎమ్‌ఐఎమ్ సభ్యులు నలుగురిని కలుపుకొన్నానని తేజస్వి వివరించారు. యేమైనా బీహార్‌లో బిజెపికి యిది హెచ్చరికే. నితీశ్ తేజిస్విలు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కొంచెమైనా లేకపోలేదు.ఆర్‌జెడి వొక్కటే సెక్యులర్ పార్టీ అని భావించి తాము అందులో చేరామని ఎమ్‌ఐఎమ్ శాసన సభ్యులు ప్రకటించడం కొసమెరుపు. గత అసెంబ్లీ యెన్నికల్లో ఎమ్‌ఐఎమ్ సీమాంచల్‌లో ఐదు స్థానాలు గెలుచుకొన్నది. అది ఆ యెన్నికల్లో పోటీ చేయడం వల్ల ఆర్‌జెడికి నష్టం వాటిల్లి అధికారాన్ని పొందలేకపోయిందనే విమర్శ వినవచ్చింది.

4 AIMIM MLAs Joins RJD Party in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News