న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు నలుగురు బిజెపి ఎంఎల్‌ఎలను గురువారం మార్షల్స్ సాయంతో సభనుంచి బలవంతంగా బయటికి పంపేశారు. మణిపూర్‌లో హింసపై స్వల్పకాలిక చర్చను ఆప్ ఎంఎల్‌ఎ దుర్గేశ్ పాఠక్ ప్రారంభించగా బిజెపి ఎంఎల్‌ఎలు లేచినిలబడి నిరసన తెలియజేయడం ప్రారంభించారు. ఢిల్లీకి సంబంధించిన సమస్యలను మాత్రమే సభలో చర్చించాలని వారు వాదించారు. ఈ దశలో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా జోక్యం చేసుకుని ‘మణిపూర్ అంశం అసెంబ్లీలో చర్చించకూడని అంశమని బిజెపి ఎంఎల్‌ఎలు భావిస్తున్నారా?
యుపి అసెంబ్లీ కూడా మణిపూర్ సమస్యను చర్చించింది’ అని అన్నారు. అయినా బిజెపి ఎంఎల్‌ఎలు ఆందోళన కొనసాగించడంతో వారిలో నలుగురు అభయ్ వర్మ, జితేంద్ర మహాజన్, అజయ్ మహావార్, ఒపి శర్మలను మార్షల్స్ బలవంతంగా సభనుంచి బైటికి తీసుకెళ్లారు. అయినా గొడవ సద్దుమణగకపోవడంతో బిజెపి సభ్యులు మణిపూర్ అంశంపై చర్చకు అడ్డుపడడం దురదృష్టకరమని పాఠక్ అన్నారు. పాఠక్ నేతృత్వంలో ఆప్ సభ్యులు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.