నిందితుల అరెస్ట్
సంగారెడ్డి : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న లారీతో పాటు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్‌పి రమణకుమార్ వెల్లడించారు. డిఎస్‌పి బాలాజీ సంగారెడ్డి రూరల్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి జహీరాబాద్ వైపు వెళుతున్న లారీలో గంజాయి తరలిస్తున్నారనే సమాచరంతో పోలీసులు రోడ్డుపై మాటు వేసి లారీని పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్‌పి వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అనిల్ గోవింద్ కలిముక్తి, గణేష నంద కిషోర్‌లను పోలీసులు తనిఖీ చేసి పట్టుకొని విచారించగా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన అనిల్‌రెడ్డితో కుమ్మక్కై తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఎండు గంజాయిని తరలిస్తే 50వేల నగదును అందజేస్తామని చెప్పారన్నారు. ఒక్కొక్క సంచిలో రెండు కిలోల చొప్పున 10 ప్యాకెట్స్‌లో మొత్తం 600కిలోల గంజాయి ఉందన్నారు. కంది తహశీల్దార్ ఆధ్వర్యంలో గంజాయిని పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ ఎస్‌పి నికిత పంత్, రూరల్ సిఐ శివలింగం తదితరులు పాల్గొన్నారు.