Monday, December 23, 2024

మొదటి యుపిఐ పేమెంట్‌కు 4 గంటల పరిమితి

- Advertisement -
- Advertisement -

ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీకి కనీస సమయం ప్రతిపాదన
ఆన్‌లైన్ మోసాలకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు: నివేదిక

న్యూఢిల్లీ : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు వేగంగా పెరుగున్నాయి. కానీ, అదే సమయంలో మోసాలు కూడా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో యుపిఐ ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో కొత్త ప్రక్రియను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నిర్దిష్ట మొత్తానికి మించి మొదటిసారి లావాదేవీలు జరిపితే కనీస కాల పరిమితిని నిర్ణయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది అమల్లోకి వస్తే గనుక రూ.2 వేల లావాదేవీలు నాలుగు గంటలు ఆలస్యం అవుతాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన నివేదికలో ఈ సమాచారం ఇచ్చింది. దీంతో సైబర్ మోసాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

అయితే దీని వల్ల డిజిటల్ చెల్లింపులు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపిఎస్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్), యుపిఐ డిజిటల్ చెల్లింపులు కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు కొత్త వినియోగదారు ఇప్పుడు యుపిఐ ఖాతాను తెరిచినట్లయితే 24 గంటల్లో గరిష్టంగా రూ. 5,000 డిపాజిట్ చేయవచ్చు. అలాగే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్)లో లబ్ధిదారుని జోడించిన తర్వాత రూ. 50,000 బదిలీ చేయవచ్చు. కొత్త ప్లాన్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటిసారి రూ.2000 దాటితే 4 గంటల వేచిచూడాల్సి వస్తుంది. ఈ ప్రతిపాదనపై ఆర్‌బిఐ, ప్రభుత్వం,ప్రైవేట్ రంగ బ్యాంకులు, గూగుల్, రేజర్‌పే వంటి టెక్ కంపెనీలతో సహా పరిశ్రమ వాటాదారులతో సమావేశంలో చర్చలు జరుగుతాయని నివేదిక వెల్లడించింది.

ఆర్‌బిఐ వార్షిక నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపు విభాగంలో అత్యధిక మోసాలను బ్యాంకులు గుర్తించాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం 13,530 మోసం కేసులు నమోదయ్యాయి. వీటిలో రూ. 30,252 కోట్ల మోసం జరిగింది. ఇటీవల యూకో బ్యాంక్ తన ఐఎంపిఎస్ ద్వారా రూ.820 కోట్లను తప్పుగా బదిలీ చేసింది.

రూ.820 కోట్లలో రూ.649 కోట్లను రికవరీ చేయగలిగామని యూకో బ్యాంక్ తెలిపింది. ఇది తప్పుగా పంపిన మొత్తంలో దాదాపు 79 శాతం ఉంటుంది. అయితే, ఈ సాంకేతిక లోపం మానవ తప్పిదం వల్ల జరిగిందా? లేదా ’హ్యాకింగ్’ ప్రయత్నాల వల్ల జరిగిందా? అనేది యుకో బ్యాంక్ ఇంకా స్పష్టం చేయలేదు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ దీనిపై చర్యలు చేపట్టి, ప్రభుత్వ బ్యాంకులకు కీలక సూచనలు చేసింది. బ్యాంకులు భవిష్యత్తులో సైబర్ ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News