రాజౌరి: జమ్మూ కశ్మీరులోని రాజౌరీ జిల్లాలోని కొండి అడవిలో శుక్రవారం ఉగ్రవాదులు అమర్చిన బంబు పేలుడులో ప్రత్యేక దళాలకు చెందిన ఇద్దరు సైనిక సిబ్బంది మరణించగా ఒక మేజర్ ర్యాంక్ అధికారితోసహా నలుగురు జవాన్లు గాయపడ్డారు. జమ్మూ ప్రాంతంలోని భాగా ధూరియాకు చెందిన తోతా గలి ప్రాంతంలో గత నెల ఒక సైనిక ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్రత్యేక దళాలు ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు ఆర్మీకి చెందిన ఉత్తర కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. కోడి అడవిలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందడంతో ఉమ్మడి దళాలకు చెందిన సైనిక బృందం మే 3వ తేదీ నుంచి గాలింపు చర్యలు చేపట్టినట్లు సైన్యం తెలిపింది.
శుక్రవారం ఉదయం సైనిక బృందానికి ఉగ్రవాదులు ఆచూకీ లభించిందని, వారు దట్టమైన అడవిలో దాక్కుని ఉన్నట్లు తెలిసిందని సైన్యం పేర్కొంది. ఉగ్రవాదులు పేల్చిన మందుపాతరకు ఇద్దరు జవాన్లు మరణించారని, మరో నలుగురు గాయపడ్డారని ప్రకటనలో సైన్యం తెలిపింది. అయితే..ఐదుగురు మరణించారని, మేజర్ ర్యాంకు అధికారికి గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. కాగా..ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి అదనపు సైనిక బలగాలను తరలించినట్లు సైన్యం తెలిపింది. గాయపడిన వారిని ఉధంపూర్‌లోని కమాండ్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపిది.