బట్టలు ఆరవేస్తుండగా విషాదం
మృతులు రెండు జంటలు
మహబూబాబాద్ జిల్లా ఆమన్‌గల్‌లో దుర్ఘటన
మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ మండలం ఆమనగల్లు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.ఓ ఇంట్లో సత్తయ్య (50) స్నానం చేసి బట్టలారేసే దండేన్ని ముట్టుకోగా విద్యుత్ సరఫరా ఉన్న దండెం మూలంగా షాక్ తగిలి అక్కడిక్కడే సహా కుప్పకూలిపోయాడు. భర్తకు ఏమైందో తెలుసుకునేందుకు భార్య రాధమ్మ (40) ప్రయత్నించగా భార్య రాధమ్మ సైతం విద్యుదాఘాతానికి గురై కేకలు వేయడంతో ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య(46), లక్ష్మి(42)దంపతులు వీరిని రక్షించే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ఒకరి తరువాత ఒకరు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు మహబూబాబాద్ జిల్లా కేంద్ర దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నామని మహబూబాబాద్ రూరల్ ఎస్సై రమేష్ బాబు తెలిపారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి సత్యవతి
అమనగల్‌లో చోటు చేసుకున్న విద్యుదాఘాతం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించి ఘటన పట్ల తన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరుపున మృతుల కుటుంబాలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
4 killed due to Electricity Shock in Mahabubabad