యెమెన్‌లో అమెరికా జరిపిన దాడుల్లో 24 మంది మరణించారు. ఆ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ‘హౌతీల సమయం అయిపోయింది’ అని స్పష్టం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇరాన్‌ను కూడా హెచ్చరించారు. హౌతీలకు మద్దతు తక్షణం ఆపాలని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. ‘హౌతీ ఉగ్రవాదులు అందరికీ హెచ్చరిక. వారి సమయం ముగిసింది. ఇప్పటి నుంచి మీ దాడులకు ఫుల్‌స్టాప్ పెట్టవలసిందే. కాదంటే గతంలో ఎన్నడూ చూడనంతగా నరకం చూస్తారు’ అని ట్రంప్ సోషల్ మీడియాచ పోస్ట్‌లో హెచ్చరిక జారీ చేశారు. హౌతీలు బలంగా ఉన్న యెమెన్ రాజధాని సానాలో అమెరికా జరిపిన దాడుల్లో 13 మంది పౌరులు, మరి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ఇది ఇలా ఉండగా, యెమెన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా మృతుల సంఖ్య 31కి పెరిగినట్లు హౌతీ రెబెల్స్ అధీనంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
శనివారం రాత్రి దాడుల్లో మరి 101 మంది గాయపడినట్లు మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనీస్ అల్ అస్బాహి తెలిపారు. ఆమెరికా బాంబు దాడులతో సానా చుట్టుపక్కల ప్రాంతాలో భూమి కంపించింది. దీనితో అందరూ భూకంపం వచ్చిందని భ్రమపడ్డారు. ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని హౌతీ పొలిటికల్ బ్యూరో ఆరోపించింది. ఆ దాడులకుసమాధానం చెప్పేందుకు యెమెన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని బ్యూరో హెచ్చరించింది. గత దశాబ్దంలో యెమెన్‌లోని ఎక్కువ భూభాగాన్ని హైతీలు తమ అధీనంలోకి తీసుకున్నారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమైన తరువాత దాని తీరంలోని ఓడలపై హౌతీలు దాడులు ప్రారంభించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఆటంకంగా మారింది. గాజాలో యుద్దంపై పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు జరుపుతున్నట్లు హౌతీలు చెబుతున్నారు. కాగా, 2023 నుంచి హౌతీలు 174 పర్యాయాలు అమెరికా యుద్ధ నౌకలపై, 145 సార్లు వాణిజ్య నౌకలపై దాడి చేసినట్లు సమాచారం.