Friday, September 20, 2024

‘జూబ్లీహిల్స్’ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ ః నగరంలోని జూబ్లీహిల్స్ రేప్ కేసులో ఎంఎల్‌ఎ కుమారుడితో పాటు మరో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో నలుగురు మైనర్ బాలురు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు మైనర్ బాలురకుగాను నలుగురికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ బెయిల్ సైతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. సాదుద్దీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఏప్రిల్ 28న ఓ పార్టీలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌కు వచ్చిన మైనర్ బాలికపై సాదుద్దీన్ అనే యువకుడితో పాటు నలుగురు మైనర్లు సామూహిక అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుల కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉండటంతో కేసు సంచలనంగా మారింది. నలుగురు మైనర్లు కావడంతో పోలీసులు ముందు నుంచి సాదుద్దీన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మిగతా మైనర్ నిందితుల్లో ఓ ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ఇద్దరు వ్యాపారవేత్తల కుమారులున్నారు. ఈ కేసులో నేరాలు నిర్ధారణ అయితే నిందితులకు 20 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
420 పేజీల చార్జిషీట్ ః
ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు 420 పేజీలతో చార్జిషీట్ సిద్ధం చేశారు. ముఖ్యంగా ఫోరెన్సిక్, వైద్యుల నివేదికలను ఈ చార్జిషీట్‌లో ప్రపస్తావించారు. ఈ కేసును కీలకంగా భావించిన పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా చార్జిషీట్‌ను న్యాయనిపుణుల సలహా కోసం పంపినట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే డిఎన్‌ఎ నమూనాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్ పంపించిన పోలీసులు తగిన ఆధారాలు సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన రోజు ఆమె వేసుకున్న దుస్తులపై మైనర్ బాలుర డిఎన్‌ఎను ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు గుర్తించారు. కారులోనూ ఆరుగురి డిఎన్‌ఎ సరిపోలినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. అంతే కాకుండా సిసిటివి దృశ్యాలతో పాటు మైనర్ బాలురు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ సెల్‌ఫోన్‌లను పోలీసులు పరిశీలించారు. అత్యాచారం జరిగిన సమయంలో అదే లోకేషన్‌లో నిందితుల సెల్‌ఫోన్‌లున్నట్లు సాంకేతికత ఆధారాల ద్వారా గుర్తించారు. లైంగిక పటుత్వ పరీక్షల్లోనూ వైద్యులు అందరికీ సామర్ధ్యం ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఈ అంశాలన్నింటినీ నేరాభియోగ పత్రంలో దాఖలు చేశారు. కాగా మైనర్ బాలురను మేజర్‌లుగా పరిగణించి విచారణ చేయాలని పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. తీవ్రనేరం చేసినందుకు గాను మైనర్లను మేజర్లుగా పరిగణించి తగిన శిక్ష వేయాలని జూబ్లీహిల్స్ పోలీసులు నేరాభియోగపత్రంలో బోర్డును అభ్యర్థించనున్నారు.

4 Minors Got Bail in Jubilee Hills Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News