Monday, December 23, 2024

కేంద్ర ఉద్యోగులకు డిఎ 4 శాతం పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డిఎ)ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పుడు 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.12,815 కోట్ల భారం పడుతుందని కేబినెట్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

కాగా ప్రస్తుత డిఎ పెంపు ఈ ఏడాది జనవరి 1వ తేదీనుంచి వర్తిస్తుందని ఆ ప్రకటన తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో చివరగా కేంద్రం డిఎను సవరించింది. ఏడాదిలో రెండు సార్లు డిఎ సవరించడం జరుగుతుంది. కాగా ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై ఇప్పుడిస్తున్న రూ.200 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 2023 24 సీజన్‌కు ముడి జనుము మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.300 పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ముడి జనుము కనీస మద్దతు ధర రూ.5,050కి చేరుకుంటుందని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News