కువైట్ సిటీ : దక్షిణ కువైట్‌లో బుధవారం తెల్లవారు జామున వలస కార్మికులు నివసిస్తున్న ఒక భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది భారతీయులు దుర్మరణం చెం దారు. ఇంకా డజన్ల కొద్దీ గాయపడ్డారు. కువైట్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎన్‌బిటిసి ఆ భవనాన్ని నిర్మించింది. స్థానిక మీడియా వార్తల ప్రకారం, మంగాఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలోని వంటగదిలో బుధవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 6 గంటలకు మంటలు లేచాయి. క్రిమినల్ ఎవిడెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఐద్ అల్ ఒవైహాన్ ప్రాథమిక మృతుల సంఖ్య 50 అని నిర్ధారించారు. మరి ఆరుగురు గాయాలతో ఆ తరువాత ఆసుపత్రిలో మరణించారు. ప్రమాద స్థలంలో క్రిమినల్ ఎవిడెన్స్ సిబ్బంది పరిశీలన పూర్తయ్యేంత వరకు మంగాఫ్ భవనం యజమానిని, భవనం కాపలాదారును, కార్మికుల బాధ్యత ఉన్న సంస్థ యజమానిని పట్టుకోవాలని పోలీసులను కువైట్ దేశీయాంగ శాఖ మంత్రి షేఖ్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబాహ్ ఆదేశించినట్లు ‘కువైట్ టైమ్స్’ వెల్లడించింది. ‘
బుధవారం సంభవించిన ఘటన కంపెనీ, భవన యజమానుల అత్యాశ ఫలితం’ అని అగ్ని ప్రమాన స్థలాన్ని సందర్శించిన మంత్రి ఒక ప్రకటనలో ఆరోపించారు. కువైట్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎన్‌బిటిసి ఆ భవనాన్ని నిర్మించింది. భారత సంతతి వాణిజ్యవేత్త కెజి అబ్రహామ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామి. 195 మందికి పైగా కార్మికుల వసతి కోసం ఎన్‌బిటిసి ఆ భవనాన్ని అద్దెకు ఇచ్చింది. ప్రమాద ఘటనపై ఆ సంస్థ ఇంకా స్పందించవలసి ఉంది. ‘అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని కార్మికుల నివాసం కోసం ఉపయోగించారు. అక్కడ అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు’ అని సీనియర్ పోలీస్ కమాండర్ ఒకరు ప్రభుత్వ టివితో చెప్పినట్లు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తెలియజేసింది. ‘డజన్ల కొద్దీ వ్యక్తులను రక్షించడమైంది. కానీ దురదృష్టవశాత్తు మంటల నుంచి వచ్చిన పొగ పీల్చడం వల్ల అనేక మరణాలు సంభవించాయి’ అని అధికారి చెప్పారు. కువైట్ నగరంలో సంభవించిన అగ్ని ప్రమాదం విచారకరమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అనానరు. మంటల్లో గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపార. రమారమి 160 మంది వ్యక్తులు సదరు భవనంలో బస చేస్తున్నారు. అక్కడ బస చేస్తున్న అనేక మంది కార్మికులు భారత్ నుంచి వచ్చారు.
భవనంలో బస చేస్తున్న కార్మికుల్లో అధిక సంఖ్యాకులు కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన భారత జాతీయులు. మృతిచెందిన వారి వయస్సు 20, 50 మధ్య ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది. కువైట్‌లోని విదేశీ వలస కార్మికుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులు. గల్ఫ్ దేశం వేలాది మంది కార్మికులను, ముఖ్యంగా దక్షిణ భారత్ నుంచి ఆకర్సిస్తుంటుంది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఎమర్జన్సీ హెల్ప్‌లైన్ నంబర్ +965–655.5246 ఏర్పాటు చేసింది. భారత రాయబారి ఆదర్శ్ స్వైకా అల్ అదన్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న భారతీయ కార్మికులను పరామర్శించారు. ‘ఆయన పలువురు రోగులను పరామర్శించారు. రాయబార కార్యాలయం నుంచి పూర్లి సహాయం అందుతుందని వారికి హామీ ఇచ్చారు. దాదాపు అందరూ క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు’ అని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అగ్ని ప్రమాదానికి కారణాన్ని తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.