Wednesday, January 22, 2025

విద్యార్థినికి పుట్టబోయే బిడ్డకోసం సిజెఐ చాంబర్‌లో 40 నిమిషాల చర్చ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాంబర్‌లో గురువారం ఉదయం ఓ ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినికి మార్చిలో పుట్టబోయే బిడ్డగురించి ఆ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు సిజెఐ చంద్రచూడ్ … మిగతా జడ్జీలు, అడ్వకేట్లతో మాట్లాడారు. 20 ఏళ్ల ప్రెగ్నెంట్ అమ్మాయి అబార్షన్ కోరుతూ సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. అయితే పిండం 29 వారాలు దాటినందున ఎయిమ్స్ నిపుణులు ఆమె విన్నపాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పర్దీవాలాలు కేసును విచారిస్తున్న సమయంలో సిజెఐ చంద్రచూడ్ మధ్యలో జోక్యం చేసుకుని తన చాంబర్‌లోకి రావాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటిలను కోరారు. సిజెఐ చాంబర్‌లో దాదాపు 40 నిమిషాలపాటు రహస్య చర్చ జరిగింది.

ముగ్గురు జడ్జీలు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ భాటిలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. చర్చ సందర్భంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, గతంలో ఓ సారి పిల్లల్ని దత్తత తీసుకోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. అనాథలను దత్తత తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థినికి పుట్టబోయే బిడ్డను దత్తత తీసుకోవడానికి ఓ జంట సిద్ధంగా ఉందని కూడా ఆయన సిజెఐకి వివరించారు. చాలా సున్నితమైన ఈ విషయం పట్ల సిజెఐ చంద్రచూడ్ స్పందిస్తూ తాను ఇద్దరు దివ్యాంగ అమ్మాయిలను దత్తత తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థినికి పుట్టబోయే బిడ్డగురించి ఏదయినా గట్టి నిర్ణయం తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ భాటి గత కొన్నాళ్లనుంచి ఆ విద్యార్థినితో టచ్‌లో ఉన్నారు. ఒకవేళ అవసరమయితే ఆ బిడ్డను తానే దత్తత తీసుకోనున్నట్లు ఆమె తెలియజేశారు.

అయితే తుషార్ మెహతా ఇచ్చిన సలహా మేరకు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దత్తత తీసుకోవాలనుకొంటున్న జంట ముందుగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆ విద్యార్థిని అంగీకరించింది. గర్భానికి 29 వారాలు దాటినందున పిండాన్ని తొలగించలేమని ఎయిమ్స్ డాక్టర్ల బృందం ఈ కేసులో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. కానీ విద్యార్థిని మాత్రం కచ్చితంగా గర్భాన్ని తొలగించుకోవాలనే ఆలోచనలో ఉంది. దీంతో సిజెఐ వ్యక్తిగతంగా ఆ కేసును తన చాంబర్‌లో డిస్కస్ చేసి సమస్యను పరిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News