మన తెలంగాణ, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విషప్రయోగానికి 40 కోతులు బలి అయ్యాయి. జిల్లాలోని కవిత మండల పరిధిలోని శిలగం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బుధవారం చెట్ల పొదల్లో కోతులు నిర్జీవంగా పడి ఉండటం స్థానికులు గమనించారు. అక్కడే మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో ఉండటంతో వాటికి ఆహారం అందించినప్పటికీ స్వీకరించలేని స్థితిలో ఉన్నాయని వారు తెలిపారు. సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన కోతులకు పోస్టు మార్టం నిర్వహించామని, ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని కాసీబుగ్గ అటవీ అధికారి మురళీకృష్ణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని, ఎక్కడో చనిపోయిన కోతులను ట్రాక్టర్‌లో తీసుకొచ్చి గ్రామ సమీపంలో పడేసి వెళ్ళిపోయారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.