దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం ఉదయం ఢిల్లీలోని 40 పాఠశాలలకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా స్కూల్, మయూర్‌విహార్‌లోని మదర్ మేరీస్ స్కూల్, బ్రిటిష్ స్కూల్, సాల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్, డిఎవి స్కూల్ పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన స్కూల్స్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రెండు పాఠశాలల ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎటువంటి అభ్యంతరకరమైన వస్తువు కనిపించలేదు. దీంతో వచ్చిన ఈ మెయిల్ ఫేక్ అని భావిస్తున్న పోలీసులు.. ఎవరు పంపించారు? అనే దానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.