Friday, November 22, 2024

మెగా డిఎస్‌సిలో 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి

- Advertisement -
- Advertisement -

బిసి నిరుద్యోగ సంఘం డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : మెగా డిఎస్‌సిలో 40వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బిసి నిరుద్యోగ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం బిసి భవన్‌లో బిసి నిరుద్యోగ సంఘం సమావేశం జరిగింది. బిసి నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, సి. రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ బసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు ఇస్తుంటే కొందరు విద్యాశాఖ అధికారులు 10 వేలు, 12వేలు అంటూ సాగదీస్తున్నారని విమర్శించారు. వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కించాలని, గత 10 సంవత్సరాల కాలంలో ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎంత మంది ప్రమోషన్లు పొందారు. ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. లెక్కించి వాటన్నింటినీ భర్తీ చేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 25వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పిఆర్‌సి కమిటీ తమ నివేదికలో పేర్కొన్నదని, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ 13వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని కృష్ణయ్య తెలిపారు. ‘ 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయన్నారు. 16 వేల విద్యా వాలంటీర్‌లను రెండు సంవత్సరాల క్రితం నియమించారని, ఇప్పుడు కూడా 16 వేల స్పెషల్ టీచర్లు నియమించడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేకపోతే ఈ స్పెషల్ టీచర్లు ఎందుకుని ఆయన ప్రశ్నించారు. 10వేలమంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్ ఇస్తే ఇంకో 10వేల పోస్టులు వస్తాయని ఆయన తెలిపారు.

టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 16 వేల పాఠశాల్లో ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేరని తెలిపారు. విద్యార్థులుకు ఈ సబ్జెక్టుల్లో విషయ పరిజ్ఞానం లేక చదువులల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. బేసిక్ విషయ పరిజ్ఞానం లేక జాతీయ పోటీ పరీక్షలలో, ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర పరీక్షలలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలో పిఆర్‌సి రిపోర్ట్ ప్రకారం రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ 24 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4,900 పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 10 వేల పిఈటి పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వం జిఓ ప్రకారం ప్రతి పాఠశాలకు ఒక పిఈటి టిచర్ ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న 5 వేల ఆర్ట్-క్రాఫ్ట్, డ్రాయింగ్ టిచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక కంప్యూటర్ చొప్పున 4 వేల ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు పంపించినా ఇంత వరకు కంప్యూటర్ టిచర్లను నియమించలేదని కృష్ణయ్య తెలిపారు. వెంటనే 4 వేల కంప్యూటర్ టిచర్లను నియమించాలన్నారు.

పాఠశాలల్లో ఊడ్చేందుకు వెంటనే 15 వేల అటెండర్, స్వీపర్ పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాస్తవ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహంతో ఉన్నారని వెంటనే పోస్టులు పెంచాలని కోరారు. లేనిపక్షంలో ఉధ్యమం తీవ్ర రూపం దాలుస్తుందని కృష్ణయ్య హెచ్చరించారు. ఈ సమావేశానికి గుజ్జ కృష్ణ, జిల్లపల్లి అంజి, గోరేగే మల్లేష్ యాదవ్, అనంతయ్య, పి. సుధాకర్, కృష్ణ యాదవ్, నందా గోపాల్, కోటేశ్వరి, మోడి రాందేవ్, ఉదయ్, లింగయ్య యాదవ్, నిమ్మల వీరన్న, శ్రీమాన్, బలరామ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News