Wednesday, January 22, 2025

మైనర్ కూతురిని రేప్ చేస్తున్నా పట్టించుకోని తల్లి; 40 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

తన ఏడేళ్ల బాలికపై తండ్రి వరసయ్యే వ్యక్తి రేప్ చేస్తున్నా ఆ తల్లి పట్టించుకోలేదు సరికదా, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది. ఫలితంగా, తండ్రిలాంటివాడి చేతిలో పలుమార్లు ఆ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ కేసును విచారించిన తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఆ తల్లిని ‘మాతృత్వానికే మాయనిమచ్చ’ గా అభివర్ణించింది. దారుణమైన ఈ సంఘటన మార్చి 2018- సెప్టెంబర్ 2019 మధ్య చోటు చేసుకుంది.

పల్లిక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే 42 ఏళ్ల మహిళ మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన భర్తను వదిలేసింది. ఆ దంపతులకు అప్పటికే ఏడేళ్ల కూతురు ఉంది. ఆమె తన కూతురును తీసుకుని మాదవూరుకు చెందిన 58 ఏళ్ల శిశుపాలన్ అనే వ్యక్తితో కలసి, సహజీవనం చేయసాగింది. ఈ క్రమంలో అతని కన్ను ఏడేళ్ల బాలికపై పడింది. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘోరాన్ని బాలిక తన తల్లితో చెప్పుకుంటే, అతనిని నిలదీయలేదు సరికదా, ఎవరికీ చెప్పొద్దంటూ కూతురునే బెదిరించింది. దీనిని అలుసుగా తీసుకుని శిశుపాలన్ పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లి సమక్షంలోనే బాలికపై అత్యాచారం చేసినా ఆమె పట్టించుకోలేదని ప్రాసిక్యూషన్ నిరూపించింది. బాలికకు ఒక అక్క ఉందనీ, వివాహమై దూరంగా ఉంటున్న ఆమె చుట్టపుచూపుగా వస్తే, ఆమెపై కూడా శిశుపాలన్ అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో బాలిక తల్లి శిశుపాలన్ ను వదిలిపెట్టి, మరొక వ్యక్తి పంచన చేరింది. అతను కూడా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడం ఘోరం. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

కాగా మొదటి కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో బాలిక తల్లిపై మాత్రమే కేసు కొనసాగింది. ఈ కేసుపై తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి రేఖ తీర్పు చెబుతూ నిందితురాలికి 40 ఏళ్ల కఠిన జైలు శిక్షతోపాటు పది వేల రూపాయల జరిమానా కూడా విధించింది.  అత్యాచారానికి గురైన బాలికలిద్దరినీ పోలీసులు బాలికల శరణాలయంలో చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News