కాబూల్ నుంచి ఢిల్లీకి క్షేమంగా
ఒక్కరోజు 400 మంది తరలింపు
భారతీయులు 329 మంది
ఇద్దరు అఫ్ఘన్ ఎంపీలు కూడా
న్యూఢిల్లీ: కల్లోల అఫ్ఘనిస్థాన్ నుంచి ఆదివారం భారతదేశం దాదాపుగా 400 మందిని ఇక్కడికి సురక్షితంగా తరలించింది. వీరిలో 329 మంది భారతీయులు, ఇద్దరు అఫ్ఘన్ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీరిని వేర్వేరు విమానాలలో కాబూల్ నుంచి తీసుకువచ్చారు. తాలిబన్లు అఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తరువాత క్రమేపీ పలు విధాలుగా అక్కడ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. ఈ దశలో అక్కడ చిక్కుపడి ఉన్న భారతీయ పౌరులను తరలించడం ప్రాధాన్యతాంశంగా కేంద్రం భావించుకుని ఇందుకు అనుగుణంగా అక్కడికి వాయుసేన విమానాలను, ఇతరత్రా విమానాలను పంపిస్తోంది. ముందుగా 168 మందితో కూడిన ఐఎఎఫ్‌కు చెందిన సి 17 భారీ స్థాయి సైనిక రవాణా విమానం ఇక్కడికి దగ్గరిలోని హిండాన్ వైమానిక స్థావరంలో దిగింది. ఈ విమానంలో 107 మంది భారతీయులు, 23 మంది అఫ్ఘన్ సిక్కులు, అక్కడి హిందువులు తరలివచ్చారు. ఇక భారత వైమానిక సంస్థకు (ఐఎఎఫ్) చెందిన ఓ విమానంలో 87 మందితో కూడిన బృందం ఇక్కడికి చేరింది. వీరిలో 87 మంది భారతీయులు , ఇద్దరు నేపాలీలు ఉన్నారు. ముందుగా వీరిని కాబూల్ నుంచి ఐఎఎఫ్ విమానంలోనే తజికిస్థాన్ రాజధాని దుష్యంబేకు తరలించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు.
దోహా మీదుగా 135 మంది
గత కొద్దిరోజులుగా అమెరికా, నాటో విమానాలలో విడిగా 135 మంది భారతీయులను కాబూల్ నుంచి దోహాకు తరలించారు. వీరిని ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఆదివారం ఇక్కడికి తీసుకువచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా, ఖతార్, తజికిస్థాన్‌ల సహాయ సమన్వయాలతో భారతదేశం అత్యంత జాగ్రత్తగా తమ దేశీయులను, భారత్‌కు రావాలనుకుంటున్న వారిని కాబూల్ నుంచి తరలిస్తూ వస్తోంది. ఈ మేరకు పూర్తి ప్రణాళికయుతంగా తరలింపుల మిషన్‌ను రూపొందించుకుంది. పౌరులను అత్యవసర ప్రాతిపదికన కాబూల్ నుంచి ముందుగా దేశానికి లేదా ముందు ఏర్పాటు చేసుకున్న వేరే దేశాల ప్రధాన కేంద్రాలకు తరలించడం ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఆదివారం ఇక్కడికి 168 మందితో చేరిన విమానంలోని వారిలో అఫ్ఘన్ ఎంపిలు అనార్కలి హొనార్యర్, నరేంద్ర సింగ్ ఖాల్సా వారి కుటుంబ సభ్యులు ఉన్నారని తరలింపు ప్రక్రియతో అవగావహన ఉన్న వారి సమాచారంతో వెల్లడైంది.
తరలింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీటు వెలువరించారు. కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణికులతో విమానాలు బయలుదేరడం, ఢిల్లీకి చేరుకోవడం వంటి అంశాలను ఆయన తమ ట్వీటులో పొందుపర్చారు. దోహా నుంచి ఢిల్లీకి చేరుకున్న వారిలో అఫ్ఘనిస్థాన్‌లోని పలువిదేశీ కంపెనీల ఉద్యోగులు ఉన్నారు. గత సోమవారం నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ఆరంభం అయింది. ముందుగా భారతీయ దౌత్య కార్యాలయ సిబ్బంది, ఉన్నతాధికారులను సురక్షితంగా తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికీ తరలించిన 200 మందిలో అఫ్ఘన్‌లో భారత దౌత్యవేత్త, కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబూల్ విమానాశ్రయంలో అరాచక పరిస్థితి ఉండటం, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో పౌరులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఎక్కువగా ప్రత్యేక విమానాలను, వాయుదళానికి చెందిన విమానాలనే వినియోగిస్తోంది.