చండీగఢ్: ఇక్కడి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చ్(సిజిఐఎంఇఆర్)కు చెందిన నెహ్రూ ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఆసుపత్రిలో చికిత్స సొందుతున్న 400 మంది రోగులను సురక్షితంగా వెలుపలికి తరలించారు. హుటాహుటిన ఆక్కడకు చేరుకున్న అగ్నిమాపక శకటాలు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చాయి.
యుఎపిఎస్ వ్యవస్థ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వివేక్ లాల్ తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ముఖ్యంగా నర్సులు ఆసుత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సురక్షిత ప్రదేశాలకు తరలించారని ఆయన చెప్పారు. ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న రోగులను వేరే భవనంలోకి తరలించి వెంటనే చికిత్స పునరుద్ధరించినట్లు ఆయన చెప్పారు. గర్భిణులు, పిల్లలతోసహా రోగులందరూ సురక్షితంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.