జైపూర్: కొండచరియలు విరిగిపడిన కారణంగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన దాదాపు 400 మంది యాత్రికులు చిక్కుకుపోయారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్‌లోని భిల్వారా, అజ్మీర్ , ఇతర ప్రాంతాల నుండి సుమారు 400 మంది ప్రయాణికులు గంగోత్రి ధామ్ నుండి తిరిగి వస్తుండగా ఉత్తరకాశీలోని గబ్నాని సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో వారు చిక్కుకుపోయారని ఆయన చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన యాత్రికులు గురువారం రాత్రి చిక్కుకుపోయారని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) కమాండెంట్ రాజ్‌కుమార్ గుప్తా తెలిపారు.
అక్కడి స్థానిక యంత్రాంగంతో మాట్లాడిన అనంతరం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి బస, ఆహార ఏర్పాట్లు చేశామని సీనియర్ అధికారి తెలిపారు. ఉత్తరాఖండ్ పరిపాలన ప్రకారం, ఉత్తరకాశీ , హర్షిల్ (హల్గు గార్డ్ , గబ్నాని) మధ్య రహదారి గత సాయంత్రం నుండి అధిక వర్షపాతం కారణంగా కొండచరియలు విరిగిపడటం వలన రాకపోకలకు వీలులేకుండా తయారయిందని గుప్తా తెలిపారు.