ఇంధన సంక్షోభ దేశానికి రవాణా వెసులుబాటు
న్యూఢిల్లీ /కొలంబో : భారతదేశం నుంచి 40,000 టన్నుల డీజిల్‌తో కూడిన నౌక శ్రీలంకకు చేరుకుంది. చమురు సంక్షోభ శ్రీలంకకు భారతదేశం ఇస్తోన్న బిలియన్ డాలర్ల రుణ సాయం పరిధిలో తక్షణ రీతిలో ఈ డీజిల్‌ను లంకకు రవాణా చేశారు. ఈ డీజిల్ ఇంధనం శ్రీలంకలో పలు ప్రాంతాలలో పంపిణీ అవుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత శ్రీలంక ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఆర్థిక దీనస్థితిని ఎదుర్కొంటోంది. దిగుమతులకు అవసరం అయిన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు లేకపోవడం, సరైన స్థాయిలో దేశంలో నిత్యావసర సరుకులు అందకపోవడం, తీవ్రస్థాయిలో కరెంటు కోతలు వంటి పరిణామాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే దశలో దేశాధ్యక్షులు రాజపక్సా నివాసంపై ప్రజలు దాడికి యత్నించారు. కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలతో కర్ఫూ విధించారు. డీజిల్ పెట్రోలు కొరతతో లంకలో చాలా రోజులుగా రవాణా వ్యవస్థ కుంటుపడింది. దేశంలో రవాణా వ్యవస్థ ఎక్కువగా ప్రైవేటు సంస్థల పరిధిలోనే ఉంది. అయితే సరిపడా ఇంధన నిల్వలు లేకపోవడంతో ఈ ప్రధాన రవాణా వ్యవస్థ కుంటుపడింది. ఈ దశలో భారతదేశం నుంచి అందుతోన్న డీజిల్ కొంత మేరకు రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.