వడగాడ్పులకు తల్లడిల్లుతున్న జనం
లండన్: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి అత్యధిక పగటి ఉష్ణోగ్రతలను లండన్ చవిచూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో లండన్ నగరం వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం కార్చిచ్చు వ్యాపించి అనేక ఇళ్లు దగ్ధమై వందలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశంలో మొట్టమొదటిసారి ఉష్ణోగ్రతలు 40.3 డిగ్రీలుగా నమోదుకావడంతో వడగాడ్పులతో తల్లడిల్లిన ప్రజల నుంచి 2,600కి పైగా ఫోన్ కాల్స్ ఎమర్జెన్సీ సర్వీసులకు వచ్చినట్లు లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ తెలిపారు. లండన్‌లో అగ్నిమాపక శకటాలు రోజంతా అవిశ్రాతంగా పనిచేస్తూనే ఉన్నాయని ఆయన చెప్పారు. జులై నెలలో ఎక్కడా చుక్క వాన పడకపోవడంతో పార్కులు, ఇళ్ల ముందు పెంచుకునే తోటలు ఎండిపోవడమేగాక ఎండిపోయిన గడ్డి కారణంగా మంటలు వ్యాపించి ఇళ్లు దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. లండన్ శివార్లలో కార్చిచ్చుల కారణంగా 41 ఇళ్లు దగ్ధమయ్యాయని ఆయన చెప్పారు. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు అనేక మందిని ఆస్పత్రులలో చేర్చినట్లు ఆయన తెలిపారు.