66 శాతం జాతీయ పార్టీల సభ్యులే
న్యూఢిల్లీ: గత ఎన్నికలతో పోలిస్తే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అధిక సంఖ్యలో రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. తాజా ఎన్నికలలో 41 రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు గెలుపొందగా గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఐదు పెరిగింది. 2019 ఎన్నికలలో 36 రాజకీయ పార్గీల సభ్యులు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్(ఎడిఆర్) అధ్యయనం ప్రకారం 346 సీట్లను(64 శాతం) జాతీయ పార్టీలు గెలుచుకోగా 179 స్థానాలను(33 శాతం) రాష్ట్ర స్థాయి పార్టీలు గెలుచుకున్నాయి.
11 సీట్లను గుర్తింపు పొందని పార్టీలు గెలుచుకోగా 7 స్థానాలలో ఇండిపెండెంట్లు గెలుపొందారు. 2009 నుంచి 2024 వరకు చూస్తే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. 2024 ఎన్నికలలో 751 పార్టీలు పాల్గొనగా 2019లో 677, 2014లో 464, 2009లో 368 పార్టీలు ఎన్నికలలో పాల్గొన్నాయి. తాజా ఎన్నికలలో జాతీయ పార్టీల నుంచి 1,333 మంది అభ్యర్థులు, రాష్ట్ర పార్టీల నుంచి 532 మంది, గుర్తింపు పొందని పార్టీల నుంచి 2,580 మంది, స్వతంత్ర అభ్యర్థులు 3,915 మంది పోటీ చేశారు. 240 స్థానాలు గెలుచుకుని లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బిజెపి ఆవిర్భవించగా 99 సీట్లతో తరువాతి స్థానంలో కాంగ్రెస్, 37 స్థానాలతో మూడవ స్థానంలో సమాజ్‌వాది పార్టీ నిలిచాయి.