జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో
దక్షిణమధ్య రైల్వే అధికారుల నిర్ణయం
హైదరాబాద్: జవాద్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సుమారుగా 41 రైళ్లను ఈనెల 3, 4 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేశ్ తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాల గురించి ప్రయాణికుల ఫోన్‌లకు సందేశాల రూపంలో పంపుతామని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు జవాద్ తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో రైళ్లను రద్దు చేసినట్లు సిపిఆర్వో రాకేశ్ వెల్లడించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.