సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా బయటికి
17 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు శుభం కార్డు
రెస్కూ టీమ్‌కు ప్రధాని ప్రభృతుల హ్యాట్సాఫ్
ఉత్తర కాశీ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 రోజుల నిరీక్షణకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో వందలాది మంది అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, విదేశీ నిఫుణులు అందరూ నిర్మిరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజులుగా టన్నెల్‌లోనే ఉన్న 41 మంది కార్మికులను మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత క్షేమంగా ప్రాణాలతో బయటికి తీసుకు రాగలిగారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్కూ ఆపరేషన్ విజయవంతమైంది. నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలడంతో 17 రోజలు పాటు భూగర్భ బందీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు ప్రాణాలతో బయటికి వచ్చారు.
స్ట్రెచర్ సాయంతో ఒకరితర్వాత ఒకరిగా అందరినీ బయటికి తీసుకొచ్చారు. సొరంగంలోనుంచి బయటికి తీసుకువచ్చిన కూలీలను ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న చిన్యాలీసౌర్ ఆస్పత్రికి తరలించారు. వారంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని పరీక్షించిన అనంతరం వారికి అవసరమైన చికిత్సను, వైద్య సలహాలను అందజేస్తారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా రెస్కూ టీమ్ చేపట్టిన ‘ర్యాట్‌హోల్ మైనింగ్’ టెక్నిక్ ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి కారణమైంది. అత్యాధునిక మెషిన్లు ఆగర్ యంత్రాలు విఫలమైన చోట నిపుణుల సలహాతో చేపట్టిన ఈ ‘ర్యాట్‌హోల్ మైనింగ్’ అనుకున్న దానికన్నా వేగంగానే కార్మికుల వద్దకు చేరింది. డ్రిల్లింగ్ తర్వాత పైపింగ్ వేశారు.
అనంతరం ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది పైపుద్వారా కార్మికులు ఉన్న చోటుకు చేరుకుని వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో పరిశీలించిన తర్వాత వారిని బయటికి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్కో కార్మికుడిని ప్రత్యేకంగా తయారు చేసిన స్ట్రెచర్‌కు కట్టేసిన తర్వాత మనుషుల సాయంతో బయటికి లాగారు. ఒక్కో కార్మికుడిని బయటికి తీసుకు రావడానికి అయిదునుంచి ఏడు నిమిషాల సమయం పడుతుందని, మొత్త ప్రక్రియపూర్తి కావడానికి రెండు మూడు గంటలు పట్టవచ్చని అంతకు ముందు రెస్కూ అధికారులు చెప్పారు. కానీ మొత్తం ప్రక్రియ అనుకున్న దానికన్నా ముందే పూర్తయింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గత కొన్ని రోజులుగా ఘటనాస్థలి వద్దే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తూ వచ్చారు.కార్మికులతోను, వారి కుటుంబ సభ్యులతోను మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతూ వచ్చారు. కూలీలందరూ క్షేమంగా బయటపడాలని చేసిన ప్రార్థనలు ఫలించాయని కూలీలు బయటికి వచ్చిన అనంతరం విలేఖరులతో ధామి అన్నారు. మొట్టమొదటగా బయటికి తీసుకువచ్చిన కార్మికుడిని ధామిఆప్యాయంగా హత్తుకుని స్వాగతం పలికారు. కూలీలంతా క్షేమంగా బయటపడినందుకు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి ధామికి, సహాయక బృంద సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ నెల 12న( దీపావళి రోజున) సొరంగంలో పనులు చేస్తుండగా అనూహ్యంగా చోటు చేసుకున్న ఘటనతో వారంతా సొరంగంలో చిక్కుకు పోయారు. తిరుగాడడానికి రెండు కిలోమీటర్ల మేర ప్రాంతం ఉండడం, బయటినుంచి తాగునీరు. ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో వారు క్షేమంగానే ఉన్నా పూర్తిగా బయటపడేంతవరకు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తమ వారిని చూడగానే వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది జార్ఖండ్ వాసులే ఉన్నారు. మొత్తం 41 మంది కూలీల్లో 15 మంది జార్ఖండ్‌కు చెందిన వారు కాగా, ఏడుగురు యుపి, ఐదుగురు బీహార్, మరో ఐదుగురు ఒడిశా, ముగ్గురు పశ్చిమ బెంగాల్, ముగ్గురు ఉత్తరాఖండ్, ఇద్దరు అస్సాం, హిమాచల్‌ప్రదేశ్‌నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు.
అడుగడుగునా సవాళ్లే
వాస్తవానికి కూలీలను బయటికి తీసుకు వచ్చే ప్రయత్నంలో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యలు అన్నింటినఅ ధిగమించి సహాయక సిబ్బంది వారిని కాపాడగలిగారు. ముందుగా సొరంగ శిధిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేయగలిగితే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు అందుకోసం ఆగర్ యంత్రంతో డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత ప్రమాదవశాత్తు సొరంగంలోని ఇనుప పట్టీని ఢీకొట్టింది. దీంతో మిషిన్ బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పని చేయకుండా పోయింది. అయినా అధికారులు వెనుకడుగు వేయలేదు.
కొండపైనుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ చేపట్టారు. అదే సమయంలో సొరంగంలో చిక్కుకున్న ఆగర్ మిషిన్ విథిలాలను కట్టర్ సాయంతో తొలగించారు.ఆ తర్వాత 12 మంది ర్యాట్‌హోల్ మైనర్ల(బొగ్గుగనుల్లో సన్నని మార్గాలను తవ్వగల నిపుణుల)ను రంగంలోకి దింపారు. వీరు సోమవారంరాత్రినుంచి మిగతా డ్రిల్లింగ్‌ను మాన్యువల్‌గా చేపట్టారు. సోమవారం రాత్రినుంచి వీరు మెరుపు వేగంతో డ్రిల్లింగ్ చేపట్టడంతో మంగళవారం మధ్యాహ్నం 1.30 ప్రాంతానికి 57 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది.ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులోనుంచి ఒకరొకరిగా అందరినీ బయటికి తీసుకు వచ్చారు.అప్పటికే సొరంగం వెలుపల సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు.