Monday, December 23, 2024

2,290 కంపెనీలకు 4,163 ఎకరాల భూముల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

ఏడేళ్లలో టిఎస్‌ఐఐసి సంస్థ ఆధ్వర్యంలో 2,290 కంపెనీలకు
4,163 ఎకరాల భూముల కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు చెందిన 253 కంపెనీలకు 95 ఎకరాల భూమి
ఇప్పటివరకు రూ.56,597 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల ఉద్యోగాల కల్పన
పరిశ్రమలు ఏర్పాటు చేయని సంస్థలపై టిఎస్‌ఐఐసి కొరడా

8 new SMME green industrial park in dandumalkapur
మనతెలంగాణ/హైదరాబాద్: పాపారిశ్రామిక రంగాల వారీగా క్లస్టర్‌ల ఏర్పాటుకు టిఎస్‌ఐఐసి సంస్థ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందకొచ్చే పారిశ్రామిక వేత్తలకు భూములను కేటాయించడంతో పాటు వారిని ప్రోత్సహిస్తోంది. ఏడేళ్లలో టిఎస్‌ఐఐసి 2,290 కంపెనీలకు 4,163 ఎకరాల భూములను కేటాయించగా, వాటిలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు సంబంధించి 253 కంపెనీలకు 95 ఎకరాలను కేటాయించారు. తద్వారా మొత్తంగా రూ.56,597 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల ఉద్యోగాలు లభించాయి.
1,964 ఎకరాల భూమి ఇతర కంపెనీలకు కేటాయింపు
అయితే టిఎస్‌ఐఐసి అభివృద్ధి చేస్తున్న పారిశ్రామికవాడల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చాలామంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. అందులో భాగంగా టిఎస్‌ఐఐసి నుంచి భూములు తీసుకొని ఇప్పటివరకు పరిశ్రమలను ఏర్పాటు చేయని 225 సంస్థలపై టిఎస్‌ఐఐసి కొరడా ఝళిపించింది. వారి నుంచి సుమారుగా 1,964 ఎకరాల భూమిని టిఎస్‌ఐఐసి సంస్థ ఈ మధ్యనే స్వాధీనం చేసుకొని ఈ భూములను ఆన్‌లైన్ ద్వారా ఇతర సంస్థలకు కేటాయించింది. నిబంధనల ప్రకారం భూములు పొందిన ఆన్‌లైన్ కంపెనీలు ఆరు నెలల్లోగా అన్నిరకాల అనుమతులు పొంది రెండేళ్లలోగా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. అప్పుడే లబ్ధిదారులకు భూ యాజమాన్య హక్కులను కల్పిస్తారు. ఇందులో ఎటువంటి జాప్యం జరిగినా నోటీసులు జారీ చేసి భూ కేటాయింపులను టిఎస్‌ఐఐసి రద్దు చేస్తుంది.
28 కొత్త పారిశ్రామికవాడల అభివృద్ధి
వీటితో పాటు రావిర్యాల, మహేశ్వరంలలో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ క్లస్టర్, సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కు, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు, ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మెగా ఫుడ్ పార్కు, భద్రాచలంలో సీడ్ పార్క్, శివనగర్‌లో ఎల్‌ఈడి పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెళ్లిలో ఆటోమొబైల్ ఈవీ క్లస్టర్, టెక్స్‌టైల్స్ పార్కు సహా మొత్తం 28 కొత్త పారిశ్రామికవాడలను ప్రస్తుతం టిఎస్‌ఐఐసి అభివృద్ధి చేసింది. ఇందులో కొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంద్రకరణ్‌లో టెక్స్‌టైల్స్ మిల్లులకు 163.90 ఎకరాలు, వంటనూనెల కంపెనీలకు 214.40 ఎకరాలు, రాకంచర్లలో స్టీల్ అండ్ రోలింగ్ పరిశ్రమలకు 112.48 ఎకరాలు, ఫార్మాసిటీ కోసం 19,993 ఎకరాల భూమిని ప్రత్యేకంగా టిఎస్‌ఐఐసి కేటాయించింది.
మరో 15,620 ఎకరాల భూమి సేకరణకు….
రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం 1.50 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతించింది. దీంతో టిఎస్‌ఐఐసి దశలవారీగా భూసేకరణ జరుపుతూ పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తోంది. 2014 నుంచి 2021 వరకు 19,961 ఎకరాలను సేకరించి వాటిలో పారిశ్రామిక వాడలను టిఎస్‌ఐసి అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల భూమిని సేకరించడానికి టిఎస్‌ఐఐసి ముందుకెళుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఎపిఐఐసి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 23,653 ఎకరాల భూమిని మాత్రమే ఉమ్మడి పాలకులు అభివృద్ధి చేశారు.
192 ఎకరాల్లో కార్మికుల కోసం కాలనీ
ప్రస్తుతం టిఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్‌ఇండస్ట్రీయల్ పార్కులో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో అధునాతన వసతులను టిఎస్‌ఐఐసి ఏర్పాటు చేస్తోంది. కార్మికులతో పాటు యాజమాన్యాలను ఆహ్లాదపరిచేలా ఇక్కడ వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మొదటివిడతగా 450 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గ్రీన్‌ఇండస్ట్రీయల్ పార్కులో స్థలాలను కేటాయించగా మరికొంతమందికి స్థలాలు కేటాయించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కు కోసం 1,100 ఎకరాలను ప్రభుత్వం టిఎస్‌ఐఐసి అప్పగించగా అందులో 450 మందికి ప్లాట్లను కేటాయించారు. ఆయా కంపెనీలకు 450 గజాల నుంచి ఐదెకరాల వరకు కేటాయించగా, గజం ప్లాట్ ధరను రూ.1,600లుగా నిర్ణయించి టిఎస్‌ఐఐసి విక్రయించింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి మరిన్ని దరఖాస్తులు రావడంతో మరో 691 ఎకరాల భూ సేకరణను ప్రభుత్వం చేపట్టింది. ఈ పార్కు పూర్తిస్థాయిలో ప్రారంభం అయితే సుమారుగా 50 వేల మందికి ఉపాధి దొరికే అవకాశంతో పాటు రూ.1,553 కోట్ల కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం వాక్‌టు వర్క్‌లో భాగంగా 192 ఎకరాల్లో హౌసింగ్ బోర్డు కాలనీని సైతం నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News