విజేతకు కారు బహూకరణ
అత్యుత్తమ ఎద్దుకూ కారు బహుమతి
మదురై : మదురైలోని పాలమేడులో పొంగల్ 2024 జల్లికట్టు సీజన్ రెండవ రోజు ప్రధాన పోటీలో దాదాపు 42 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది ఎడ్ల నియంత్రణకు పూనుకున్నవారు కాగా, 16 మంది వీక్షకులు. 14 ఎడ్లను కట్టడి చేయగలిగిన అత్యుత్తమ వ్యక్తికి, జనం నియంత్రణను ప్రతిఘటించిన అత్యుత్తమ ఎద్దు యజమానికి ప్రతిష్ఠాకరమైన ముఖ్యమంత్రి కారును బహుమతిగా అందజేశారు. వాడివాసల్ (బరిలోకి ఎడ్లను వదిలిన ప్రవేశ ద్వారం) వద్ద ఎడ్లు దూకుడుగా బయటకు వచ్చినప్పుడు వీక్షకుల ఉత్సాహానికి అంతే లేకపోయింది.
అలా దూకుడుగా ముందుకు వచ్చిన ఎడ్ల మూపురాలను పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకులను అవి విసరికొట్టినప్పుడు కనీసం ఆరుగురు గాయపడ్డారు. వాటి నియంత్రణలో విఫలమై గాయపడిన 42 మందిలో వాటి యజమానులు 12 మంది కూడా ఉన్నారు. కాగా, మదురై జిల్లాలోని అవనియాపురంలో సోమవారం జల్లికట్టు తొలి కార్యక్రమం జరిగింది. బుధవారం అలంగనల్లూరులో గ్రాండ్ ఫినాలే జరగనున్నది. ఇది ఇలా ఉండగా, మంగళవారం 14 ఎడ్లను ‘లొంగదీసుకున్న’ పి ప్రభాకరన్ (మదురై)కి ప్రథమ బహుమతిగా ముఖ్యమంత్రి కారు బహూకరించారు.