సిఎంకు బిసి సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : రిజర్వేషన్‌ల అంశంపై చర్చించడానికి అఖిల పక్షం, బిసి కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని 96 కుల సంఘాల – 30 బిసి సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి బిసిలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 శాతం నుంచి 42 శాతానికి, స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం లకిడీకాపూల్ లోని ఓ హోటల్‌లో 96 బిసి కుల సంఘాలు, 30బిసి సంఘాల సమావేశం జరిగింది. జాతీయ బిసి సంఘం ఉపాధ్యకులు గుట్ట సత్యం, బిసి సంఘం ఆధ్యకులు రాజారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి విసృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ బిల్లు చట్టం చేశారు, దీని అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించాలన్నారు. బిసి బిల్లు అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున లోతుగా చర్చించి అమలు కోసం పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని కోరారు. బీహార్ లో, తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జిఓలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారని, తర్వాత కొందరు కోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి సవరణ చేసిందన్నారు.
జనాభా లెక్కలు సేకరించి అసంబ్లీ చట్టం చేసినందున ఇప్పడు సుప్రీంకోర్టుకు ఎవరు వెళ్ళినా సమస్య ఉండదని కృష్ణయ్య అన్నారు. సుప్రీంకోర్టు ఈడబ్లుఓ కేసులో 50 శాతం సీలింగ్ ఎత్తివేసిందని, ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం వుందని అన్నారు. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవన్నారు. దీనిపై ఇంకా సమగ్రంగా చర్చించాలని, పకడ్బంది చర్చలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సత్యం, రాజారాం యాదవ్ తదితరులు మాట్లాడారు.