42 ప్యాసింజరు రైళ్లు రద్దు
మేలో 650 రైళ్లకు బ్రేక్‌లు
గూడ్స్‌లతో బొగ్గు సరఫరాకు ప్రాధాన్యత
న్యూఢిల్లీ : దేశంలో 42 ప్రయాణికుల రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇది తక్షణం అమలులోకి వస్తుంది. ఎప్పటివరకూ ఈ రైళ్ల రద్దు ఉంటుందనేది తెలియదు. బొగ్గు ఉత్పత్తి తగ్గడం, ఇతర దేశాల నుంచి సరఫరాలు లేకపోవడంతో తలెత్తిన బొగ్గు సంక్షోభం చివరికి విద్యుత్ కటకటకు దారితీసి ఇప్పుడు అత్యవసర ప్రాతిపదికన 42 ప్యాసింజర్ రైళ్ల ద్దుకు దారితీసింది. సుదూర ప్రాంతాలలోని బొగ్గు గనులలో ఉత్పత్తి బాగానే ఉందని, అయితే బొగ్గు సకాలంలో సరఫరా కావడంలో అవసరం అయిన రవాణా ఏర్పాట్లు లోపంతో సరఫరా దెబ్బతిందని కేంద్రం అంగీకరించింది. దీనితో గనుల నుంచి థర్మల్ కేంద్రాల డిపోలకు బొగ్గు నిల్వలను సకాలంలో తరలించేందుకు ముందుగా గూడ్సు రైళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు 48 వరకూ ప్రయాణికుల రైళ్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ శుక్రవారం తెలిపింది. బొగ్గు సరఫరా సరిగ్గా లేకపోతే మే నెలలో మరిన్ని రైళ్లకు బ్రేక్‌లు పడే అవకాశం ఉంది. సాధారణంగా మే నెలలోనే ప్రజలు పర్యాటక ఏర్పాట్లు ఎక్కువగా రైళ్ల ద్వారా చేసేందుకు యత్నిస్తుంటారు. అయితే ఈసారి మే నెలలో 650 వరకూ రైళు నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడైంది. అయితే ఇది తాత్కాలికమే అని విద్యుత్ సరఫరా మెరుగుకు యత్నిస్తున్నామని, ఇది జరిగితే ఇక తిరిగి రద్దయిన రైళ్లు తిరిగి పరుగులుపెడుతాయని అధికారులు తెలిపారు.
.