ఢిల్లీలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం ఉదయం నాటికి ఈ వేరియంట్ కేసులు 781 కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్క ఢిల్లీ లోనే బాధితుల సంఖ్య 238 కి పెరిగింది. మంగళవారం ఒక్క రోజే అక్కడ 73 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత మహారాష్ట్రలో 167 కేసులు ఉన్నాయి. మొత్తంగా ఈ వేరియంట్ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. అలాగే ఇప్పటివరకు 241 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో దేశంలో కరోనా కొత్త కేసులు 44 శాతం అధికంగా నమోదయ్యాయి. మంగళవారం 11 లక్షల మందికి పైగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 9,195 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలలింది.
మహారాష్ట్ర (2172), ఢిల్లీ (496) లో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 302 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 3.48 కోట్లకు చేరాయి. 4,80,592 మంది మృతి చెందారు. మంగళవారం 7347 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రివకరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 77,002 గా ఉంది. క్రియాశీల రేటు 0.22 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.40 శాతంగా కొనసాగుతోంది. మరోపక్క మంగళవారం 64,61,341 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 142 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.