యావత్మల్ : మహారాష్ట్ర లోని యావత్మల్ జిల్లా మహగావ్ తహశీల్ లోని ఆనందనగర్ తండాలో వరద నీటిలో 45 మంది చిక్కుకున్నారు. శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతమంతా వరదనీటి మయం అయింది. దాంతో ఆ ప్రాంతం లోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆనందనగర్ తండాల్లో వరద నీటిలో చిక్కుకున్న 45 మందిని రక్షించడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మహగావ్ తహశీల్ ప్రాంతంలో 231 ఎంఎం వర్షపాతం కురిసింది. అదే సమయంలో జిల్లా మొత్తం మీద 117.5 మిమీ వర్షపాతం రికార్డు అయిందని జిల్లా కలెక్టర్ అమోల్ యెడ్గే వెల్లడించారు. ఈ జిల్లా మీదుగా ప్రవహించే పెయిన్ గంగా నది వరద నీటితో ఉప్పొంగి పారుతోంది. యావత్మల్ నగరంలో కొన్ని రోడ్లు వరద నీటి ముంపుకు గురయ్యాయి. బుల్ధానా జిల్లాలోని కాసెర్‌గావ్ గ్రామంలో 140 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యావత్మల్, గచ్చిరోలి, అమ్రావతి, వసీం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని నాగపూర్ లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ప్రాంతాలు జలమయమై సామాన్య జీవనం కుంటుపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల బారిన పడి ఈ సీజన్‌లో ఇంతవరకు 72 మంది మృతి చెందారు. థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, పాంగ్లి, జిల్లాల్లో కుంభవృష్టితో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రిస్కు ఆపరేషన్ చేపట్టాయి. థానే జిల్లాలో శనివారం సూరజ్ గవరి అనే 23 ఏళ్ల యువకుడు నడుపుతున్న బైక్ ఒక గుంతలో పడడంతో అతను రోడ్డుపైకి ఎగిరి పడ్డాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న మిక్సర్ ట్రక్కు అతనిపై నుంచి దూసుకుపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు