Wednesday, January 22, 2025

కొద్ది మంది చేతుల్లోనే భూకేంద్రీకరణ!

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో 10 శాతం కుటుంబాల వద్ద 45% భూమి ఉంది. ఈ భూ కేంద్రీకరణను గమనిస్తే పెట్టుబడిదారీ దేశాల్లో పెద్ద ఎత్తున భూ ఎస్టేట్‌దారుల, కార్పొరేట్ సంస్థల వద్ద భూ కేంద్రీకరణ ఉంటే, భారత దేశం లాంటి వెనుకబడిన దేశాల్లో 80% చిన్న, సన్నకారు రైతుల వద్ద 40% భూమి ఉంటే, పది శాతం మంది భూ కామందుల వద్ద 45% భూమి ఉంది. సేద్యం ద్వారా లభించే ఆదాయంలోనూ తీవ్రమైన వ్యత్యాసం ఉంది. హెక్టార్‌లోపు భూమి కలిగిన రైతులకు వచ్చే ఆదాయం, పెద్ద కమతాలకు వచ్చే ఆదాయంలో చాలా తేడా ఉంది. ఒక హెక్టార్ నుండి లభిస్తున్న ఆదాయం మొజాంబిక్ లో 78 డాలర్లు, జింబాబ్వేలో 83 డాలర్లు, మలావీలో 424 డాలర్లు, ఇథియోపియాలో 1184 డాలర్ల ఉందని అంచనా వేయబడింది.

ప్రపంచ దేశాలు రెండు విభాగాలుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు, పెట్టుబడిదారీ దేశాలుగా పరివర్తన చెందని వెనుకబడిన దేశాలు. ఈ రెండు విభాగ దేశాల్లో ఉన్న భూసంబంధాల్లోనూ తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. భూ ఆదాయాల్లోనూ తేడాలు ఉన్నాయి. మొత్తం భూగోళ విస్తీర్ణత 51 కోట్ల చదరపు కిలోమీటర్లుగా అంచనాగా ఉంది. అందులో 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (71%) సముద్రాలు విస్తరించి ఉన్నాయి. మిగిలిన 14.9 కోట్ల చదరపు కిలోమీటర్లు (27%) భూభాగంగా ఉంది.

అందులో 1.5 కోట్ల చదరపు కిలోమీటర్లలో హిమ నదులు ఉన్నాయి. 2.8 కోట్ల చదరపు కిలోమీటర్లు ఎడారులు, ఉప్పుభూములు, కొండలు, రాళ్లు, ఇసుక తిన్నెలు, సముద్ర తీరాలు వ్యాపించి ఉన్నాయి. మిగిలిన 10.6 కోట్ల చదరపు కిలోమీటర్లు నివాస యోగ్య ప్రాంతాలుగా ఉన్నాయి. అందులో 4 కోట్ల చదరపు కిలోమీటర్లు అడవులు, 1.7 కోట్ల చదరపు కిలోమీటర్లు చిట్టడవులు, వృక్ష జాలాలతో నిండి ఉన్నాయి. 15 లక్షల చదరపు కిలోమీటర్లు నగరాలు, గ్రామాలుగా ఉన్నాయి. సాగుకి యోగ్యమైన భూమి 4.8 కోట్ల చదరపు కిలోమీటర్లుగా ఉంది. అందులో 3.7 కోట్ల చదరపు కిలోమీటర్లు పశువులు మేయటానికి పనికి వచ్చే గడ్డి నేలలు, ఇతర మొక్కలు పెంచే భూములుగా ఉన్నాయి. 1.1 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమిలోనే పంటలు పండిస్తున్నారు. పంట సాగుకి, పశుగ్రాస ఉత్పత్తికి కలిపి 190 కోట్ల, 69 లక్షల, 21 వేల, 938 హెక్టార్ల భూమి ఉన్నట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ, ఇతర పరిశోధనా సంస్థలు అంచనా వేశాయి. 2022 నవంబర్‌లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది.

సగటున మనిషికి హెక్టార్ భూమి ఉన్నట్లుగా లెక్క వేయబడింది. 1950లో 220 కోట్ల జనాభా ఉన్నప్పుడు సగటున నాలుగు హెక్టార్ల భూమి ఉంది. ఏ కుటుంబంలోనైనా 50% కన్నా ఎక్కువ సమయాన్ని శ్రామికులు వ్యవసాయ వ్యాపకాలకు ఉపయోగిస్తే, వాటిని కుటుంబ కమతాలుగా ప్రపంచ వ్యవసాయ సంస్థ పరిగణిస్తున్నది. ఈ విధంగా 90% కుటుంబ యాజమాన్యంలో వ్యవసాయం ఉంది. వీటి కింద మాత్రం 54.7% మాత్రమే భూమి ఉంది. ఈ కుటుంబాల సగటు విస్తీర్ణం 2.2 హెక్టార్లు మాత్రమే. మిగతా 10% కుటుంబాల వద్ద 45.3% భూమి ఉంది. దీన్ని గమనిస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొద్ది మంది చేతుల్లో భూకేంద్రీకరణ ఎక్కువగా ఉందని స్పష్టమవుతున్నది.

ప్రపంచంలోని అనేక దేశాల మధ్య సగటు భూ విస్తీర్ణంలో కూడా చాలా తేడా ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కుటుంబ సగటు విస్తీర్ణం 180 హెక్టార్లు కాగా, ఆస్ట్రేలియాలో 3,340 హెక్టార్లగా ఉంది. ఉత్తర అమెరికాలో 221.6 హెక్టార్లు. దక్షిణ అమెరికాలో 34 హెక్టార్లుగా సగటు కమతం ఉంటే, యూరప్‌లో 12.8 హెక్టార్లుగా ఉంది. ఆఫ్రికాలో 9.2 హెక్టార్లు ఉంటే, తూర్పు ఆసియాలో 4.5 హెక్టార్లు. భారత్‌లో 1.02 హెక్టార్లు కాగా, బంగ్లాదేశ్ లో 0.8 హెక్టార్లుగా ఉంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనూ, కొన్ని యూరోపియన్ దేశాల్లోనూ కుటుంబ కమతాలు అగ్రభాగాన ఉన్నాయి. గత యాభై సంవత్సరాల్లో ఉన్న కమతాల సంఖ్య 30% తగ్గింది. అతి చిన్నకమతాలు మూడు రెట్లు పెరగగా, అతి పెద్ద కమతాలు ఐదు రెట్లు పెరిగాయి.

జపాన్‌లో గత 40 సంవత్సరాల్లో రెండు హెక్టార్లలోపు ఉన్న కమతాలు 70% అంతరించాయి. ఆస్ట్రేలియాలో 37% తగ్గాయి. న్యూజిలాండ్‌లో 40 హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న చిన్న కమతాలు, 800 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉన్న పెద్ద కమతాలు 35% పెరిగాయి. పశ్చిమ యూరప్‌లో 70%, తూర్పు యూరప్‌లో 40% భూకమతాలు తగ్గాయి. అర్జెంటైనాలో 40 శాతం, చిలీలో 15%, కొలంబియాలో 50 శాతం, ఉరుగ్వేలో 20% కమతాలు కూడా తగ్గాయి. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ మొదలగు దేశాలు పెట్టుబడిదారీ దేశాలుగా మారడంతో అక్కడి వ్యవసాయం కూడా పెట్టుబడిదారీ వ్యవసాయంగా మారి పెద్ద, పెద్ద భూయాజమాన్యాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చిన్న రైతులు భూములు కోల్పోయి వారి సంఖ్య తగ్గింది. వ్యవసాయం గిట్టుబాటుకాక నష్టపోయిన మధ్య తరహా రైతులు చిన్న కమతాలగా మారడంతో చిన్న కమతాల సంఖ్య పెరిగింది. చిన్న, మధ్య తరగతి కుటుంబ కమతాల భూములు పరాయీకరణ కావటం వల్ల, పెద్ద కమతాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ఈ విధంగా భూ కేంద్రీకరణ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా బహుళ జాతి సంస్థలు సహజ వనరులను కొల్లగొట్టటమే కాకుండా పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకుంటున్నాయి. బిల్ మనోన్ అనే బిలియనీర్‌కు 9 లక్షల హెక్టార్ల భూమి ఉంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ లక్షా, 80 వేల హెక్టార్లు, బిల్ గేట్ లక్షా వెయ్యి హెక్టార్లు భూమి ఉంది. ఆస్ట్రేలియాలో 10% ఉన్న పెద్ద భూకామందుల, కంపెనీల వద్ద ఆ దేశంలోని మొత్తం భూమిలో 50% ఉంది. యూరోపియన్ యూనియన్‌లో 50% హెక్టార్ల కన్నా ఎక్కువ భూమి ఉన్న కమతాలు 7.5% ఉంటే, వాటి కింద మొత్తం భూమి లో 68.2 శాతం భూమి ఉంది. భారత దేశంలో 10 శాతం కుటుంబాల వద్ద 45% భూమి ఉంది. ఈ భూ కేంద్రీకరణను గమనిస్తే పెట్టుబడిదారీ దేశాల్లో పెద్ద ఎత్తున భూ ఎస్టేట్‌దారుల, కార్పొరేట్ సంస్థల వద్ద భూ కేంద్రీకరణ ఉంటే, భారత దేశం లాంటి వెనుకబడిన దేశాల్లో 80% చిన్న, సన్నకారు రైతుల వద్ద 40% భూమి ఉంటే, పది శాతం మంది భూకామందుల వద్ద 45% భూమి ఉంది.

సేద్యం ద్వారా లభించే ఆదాయంలోనూ తీవ్రమైన వ్యత్యాసం ఉంది. హెక్టార్‌లోపు భూమి కలిగిన రైతులకు వచ్చే ఆదాయం, పెద్ద కమతాలకు వచ్చే ఆదాయంలో చాలా తేడా ఉంది. ఒక హెక్టార్ నుండి లభిస్తున్న ఆదాయం మొజాంబిక్ లో 78 డాలర్లు, జింబాబ్వేలో 83 డాలర్లు, మలావీలో 424 డాలర్లు, ఇథియోపియాలో 1184 డాలర్ల ఉందని అంచనా వేయబడింది. మొత్తం సహారా దిగువన ఉన్న ఆఫ్రికా దేశాల్లో ఒక హెక్టార్‌కు లభిస్తున్న ఆదాయం 535 డాలర్లు మాత్రమే. ఈ దేశాల ప్రజలు దారిద్య రేఖను దాటాలంటే హెక్టార్‌కు కనీసం 1250 డాలర్ల నికర ఆదాయం కావాలి. భారత దేశంలో కూడా హెక్టార్‌కు నికర ఆదాయం 600 డాలర్లకు మించి ఉండటం లేదు.

ఇందుకు భిన్నంగా ప్రపంచంలో 11 శాతంగా ఉన్న పెద్ద కమతాల ఆదాయం సంవత్సరానికి 3,50,000 డాలర్లకు మించి ఉంది. అమెరికాలో 3 శాతంగా ఉన్న పెద్ద కమతాలు, ఆ దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 43% ఆర్జిస్తున్నాయి. దీన్ని గమనిస్తే ప్రపంచ వెనుక బడిన దేశాల్లో పంటలకు సరైన ధర లభించక ఆదాయం తక్కువ రావటంతో నష్టాలపాలై భూములు కోల్పోతున్నారు. మరోపక్క కార్పొరేట్ సంస్థలు, పెద్ద భూ కమతాల వారు సేద్యం ద్వారా లక్షలాది డాలర్లు పొందుతూ తమ భూవిస్తీర్ణతను పెంచుకుంటు పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సేద్యపు భూమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెద్ద భూకామందుల వద్ద ఉన్న భూమి, కార్పొరేట్ల వద్ద పోగుబడిన భూమి పేద రైతుల, చిన్న రైతుల పరమైనప్పుడే సేద్యపు భూమి ప్రయోజనం నెరవేరుతుంది. అది జరగాలంటే వెనుకబడిన వ్యవసాయక దేశాల్లో నూతన ప్రజాతంత్ర విప్లవాలు, పెట్టుబడిదారీ దేశాల్లో సోషలిస్టు విప్లవాలు విజయవంతం కావాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News