ఐలాపూర్‌లో నిషేధిత 20 ఎకరాల్లో లే అవుట్, అక్రమ నిర్మాణాలు నేలమట్టం
అమీన్‌పూర్‌లో 462 అక్రమ కట్టడాల కూల్చివేత
రెవెన్యూ అధికారుల చర్యలపై ఆరోపణలు
మన తెలంగాణ/అమీన్‌పూర్: సంగారెడ్డి జిలా, అమీన్ పూర్ మండలం, ఐలాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోగల నిషేధిత భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న 20 ఎకరాల లేఅవుట్‌పై రెవెన్యూ అధికారులు పంజా విసిరారు. గతంలో కూల్చివేసిన స్థలంలోని మరోమారు భూమిని చదును చేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న ముఠాపై మంగళవారం మరోసారి బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. ప్లాట్లుగా విభజించి ఏర్పాటు చేసిన రాళ్ళను పూర్తిగా తొలగించడంతోపాటు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను సైతం తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అనంతరం అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని పరిధిలోని సర్వే నెంబర్ 462అక్రమ నిర్మాణాల తొలగింపు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఇచ్చిన నోటీసులకు బదులుగా పక్కనున్న పట్టాదారులైన పాండురంగారెడ్డి, కాటా మహేష్ గౌడ్ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చినప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారు. దీంతో తమ భూమి హద్దులు నిర్ణయించకుండా ప్రభుత్వ భూమిగా ఎలా నిర్ధారిస్తారని వారు అధికారులను నిలదీశారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున వచ్చిన పోలీస్ బలగాల సహాయంతో రెవెన్యూ అధికారులు నిర్మాణాలను తొలగించారు.
నా భూమి హద్దులు నిర్ణయించండి: పాండురంగారెడ్డి
రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. సర్వే నెంబర్ 461లో 1.06 ఎకరాల భూమిని అమీన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు వద్ద చాలా ఏళ్ల క్రితం కొనుగోలు చేశానని, నాటి నుంచి ఇప్పటి వరకు అదే స్థలంలో ఉంటున్నామని అన్నారు. తనకున్న భూమి హద్దులను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని గత చాలా కాలంగా రెవెన్యూ అధికారులకు విన్నవించినప్పటికీ నేటి వరకు ఎందుకు సర్వే చేయట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించాల్సిన అవసరం తనకు లేదని, తన భూమి తనకు చూపించాల్సిన బాధ్యత అధికారుల పైన లేదా అని ఆయన ప్రశ్నించారు. కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా.. కనీసం తమ విన్నపాలు సైతం వినిపించుకోకుండా ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారులు వివరించిన తీరుపై తాను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని అన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై తప్పనిసరిగా న్యాయపోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు.