గత 24 గంటల్లో 47 వేలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండడం, అలాగే మరణాలు పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 47 వేలు దాటగా, మరణాలు కూడా 500 పైనే నమోదయ్యాయి. రెండు నెలల తరువాత కొత్త కేసులు ఈ స్థాయిలో ఇప్పుడే పెరగడం గమనార్హం. కేసుల్లో 70 వాతం ఒక్క కేరళ లోనే ఉన్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 47,092 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. ఇదే సమయంలో 509 మంది వైరస్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు 4,39,528 మందిని మహమ్మారి బలి తీసుకుంది. ఇక బుధవారం మరో 35,181 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.20 కోట్ల మంది వైరస్‌ను జయించగా, రికవరీ రేటు 97.48 శాతంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండొంతులు ఒక్క కేరళ రాష్ట్రం లోనే ఉంటున్నాయి. కేరళ లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. బుధవారం ఆ రాష్ట్రంలో 173 మరణాలు సంభవించాయి. దేశంలో కొత్త కేసులతోపాటు క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,83,583 మంది వైరస్‌తో బాధ పడుతుండగా, యాక్టివ్ కేసుల రేటు 1.19 శాతానికి పెరిగింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించి బుధవారం మరో 81 లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 66 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.