Friday, March 21, 2025

హనీట్రాప్‌లో 48మంది కర్ణాటక ఎమ్‌ఎల్‌ఎలు

- Advertisement -
- Advertisement -

యువతుల్ని ఎరగా వేసి తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని ‘హనీట్రాప్’అంటారు. ఇప్పుడీ హనీట్రాప్ వలలో సుమారు 48 మంది ఎమ్‌ఎల్‌ఎలు పడ్డారని ఓ రాష్ట్ర మంత్రి కర్ణాటక అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది,. ఇటీవల ఇద్దరు మంత్రులపై హనీట్రాప్ ప్రయత్నాలు జరిగాయని, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్క్‌హోళ అసెంబ్లీలో వెల్లడించారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌ల్లో వారి అసభ్య వీడియోలు ఉన్నాయని తెలిపారు. అధికార పక్షం సహా విపక్షానికి చెందిన వారూ ఈ బాధితుల్లో ఉన్నారని వివరించారు. అంతేకాదు ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సన్నిహితుడు, కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజన్నపై రెండు సార్లు హనీట్రాప్ జరిగిందని, ఇదే అంశంపై రాష్ట్రహోంశాఖ విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. గత 20 ఏళ్లుగా నేతల్ని హనీట్రాప్ లోకి దించడం పరిపాటిగా మారింది. ఈ తరహా రాజకీయాలు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం హనీట్రాప్ చేస్తున్నారు.

ఇది ఇంతటితో ఆగిపోవాలన్నారు. హనీట్రాప్‌పై మంత్రి కెఎన్ రాజన్న మాట్లాడుతూ కనీసం 48 మంది ఎమ్మెల్యేలు హనీట్రాప్‌లో పడ్డారని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇది కొత్త విషయం కాదు. వారిలో చాలామంది హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు నాపేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. హనీట్రాప్ సూత్రధారులు , పాత్రధారులెవరో తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై దుమారం చెలరేగింది. విచారణ చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హనీట్రాప్‌పై కర్ణాటక ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఇంతకు ముందు బుధవారం బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ ఎవి సునీల్ కుమార్ కొంతమంది రాష్ట్ర మంత్రులు,నాయకులు హనీట్రాప్‌లో చిక్కుకున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయని, ఈ వదంతులపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్నికోరిన తరువాత ఈ వ్యవహారం బయటపడింది. కాంగ్రెస్‌లో వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైన నాటి నుంచి హనీట్రాప్ వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశానని రాజన్న చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News