జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఈ నెల 22న పర్యాటకులపై ఉగ్ర ముష్కరుల దాడి తరువాత దేశ భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి. ముష్కరుల పట్టివేతకు బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో కాశ్మీర్‌లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పహల్గాం దాడి అనంతరం కాశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ ఏక్టివేట్ అయినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. పహల్గాం ఉగ్ర దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం పేల్చివేస్తుండడంతో దానికి ప్రతీకారంగా వారు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రత బలగాలకు సమాచారం ఇవ్వాలని ఆ వర్గాలు సూచించాయి. దీనితో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 పర్యాటక కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కాశ్మీర్‌లోని ప్రధాన ప్రదేశాలు గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ సరస్సు ప్రాంతాలతో పాటు సున్నితమైన పలు పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించారు. 22న పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడిన విషయం విదితమే. ఆ ఘటనలో 26 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో వ్యక్తులు గాయపడ్డారు. దీనితో అక్కడి నుంచి పర్యాటకులను ప్రత్యేక విమానాల్లో తరలించి, ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం పర్యాటకులు మళ్లీ కాశ్మీర్‌కు వస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాలు తాజా హెచ్చరికలు చేశాయి. కాగా, పహల్గాం ఉగ్ర దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు చేస్తున్నది. ఆ ఘటనకు సంబంధించి పలు వీడియోలు, సమాచారం అందడంతో వాటి ఆధారంగా ఉగ్రవాదులను గుర్తించడానికి ఎన్‌ఐఎ విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఉగ్ర దాడి ప్రదేశంలో సీన్ తిరిగి సృష్టిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఆ సమయంలో ఉన్న పర్యాటకులను, స్థానిక ప్రజలను ఎన్‌ఐఎ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్కద వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వారు తెలిపారు.