Wednesday, January 22, 2025

పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ఎంసిసి అమలు కాలంలో బిఎస్‌ఎఫ్ చర్య

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం సాగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసిసి) అమలులో ఉన్న ఈ అరవై రోజుల్లో భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో 49 డ్రోన్లను కూల్చివేయడమో, స్వాధీనం చేసుకోవడమో జరిగిందని తాజా డేటా వల్ల తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన, భారత పంజాబ్ ప్రాంతంలో, రాజస్థాన్‌లో ప్రవేశించిన, ప్రధానంగా ఈ చైనా తయారీ యుఎవిల స్వాధీనం 2022 దరిమిలా జనవరి, మే కాలంలో దాదాపు 13 రెట్లు అధికం అని తెలుస్తోంది.

ఎన్నికల కమిషన్ (ఇసి) దేశంలో ఏడు దశల ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించిన రోజు మార్చి 16న ఎంసిసి అమలులోకి వచ్చింది. 2289 కిలో మీటర్ల భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దును కాపలా కాసే సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్) రూపొందించిన, ‘పిటిఐ’ వార్తా సంస్థ విశ్లేషించిన డేటా ప్రకారం, మార్చి 16 నుంచి ఇప్పటి వరకు మొత్తం 49 డ్రోన్లను లేదా యుఎవిలను సరిహద్దు భద్రత సంస్థలు కూల్చివేయడం లేదా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లో గరిష్ఠంగా 47 డ్రోన్ల స్వాధీనం జరిగింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లకు జూన్ 1న ఒకే దశలో పోలింగ్ జరగనున్నది. ‘భద్రతకు ముప్పు’ అయిన ఆ డ్రోన్లలో తక్కిన రెండింటిని రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, బికనేర్ సెక్టార్లలో సరిహద్దు పొడవునా స్వాధీనం చేసుకున్నారు.

ఆ సరిహద్దులో కూడా బిఎస్‌ఎఫ్ కాపలా కాస్తుంటుంది. పంజాబ్‌లో అత్యధికంగా అమృత్‌సర్ సెక్టార్‌లోను, ఆ తరువాత ఫిరోజ్‌పూర్, గురుదాస్‌పూర్, అబొహార్‌లో స్వాధీనం చేసుకున్నట్లు డేటా సూచిస్తోంది. ‘ఆ అక్రమ డ్రోన్లు డ్రగ్‌లు, ఆయుధాలు కూడా తెస్తున్నందున పాకిస్తాన్ సరిహద్దు పొడుగునా భద్రతకు తీవ్ర ముప్పు కలిగించే వాటిని కూల్చడానికి లేదా కనిపెట్టడానికి మానవ నిఘా, సాంకేతిక సాధనాలను ఉపయోగిస్తున్నాం. డ్రగ్‌లు, ఒక్కొక్కసారి ఆయుధాలను ప్రవేశపెట్టే ఆ యుఎవిల వల్ల ఎన్నికల ప్రక్రియ దెబ్బ తినకుండా చూసేందుకు మరింతగా నిఘా వేసి ఉంచాలన్న ఇసి ఆదేశాల దృష్టా బిఎస్‌ఎఫ్, పంజాబ్, రాజస్థాన్ పోలీస్ వంటి సోదర సంస్థలు, వివిధ మాదకద్రవ్య నిరోధక విభాగాలు మొదలైనవి తమ యత్నాలను ముమ్మరం చేశాయి’ అని పంజాబ్‌లో బిఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.

భారత, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ పొడుగునా విస్తరించి ఉంది. పంజాబ్ ప్రాంతం పాకిస్తాన్‌తో 553 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. జమ్మూ ప్రాంతంలో 2020లో మొదలైన డ్రోన్ బెడద రికార్డు స్థాయిలో ఇంకా సాగుతూనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News