ట్రూజెట్ విస్తరణకు 49 శాతం విదేశీ నిధులు
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకం ద్వారా త్వరలో దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్టు ట్రూజెట్ సంస్థ వెల్లడించింది. తొలిదశలో 21 రూట్లను పొందిన తమ సంస్థ ఆయా ప్రాంతాలకుఇప్పటికే విమాన సర్వీసులును సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్టు ఎంఇఐఎల్ గ్రూప్ డైరెక్టర్ కెవి ప్రసాద్ వెలడించారు. హైదరాబాద్‌నుంచి ముంబై, ఔరంగాబాద్, చెన్నై, గోవా, బెంగుళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి, అహ్మదాబాద్, పోరుబందర్ , జైసల్మేర్, నాసిక్, జగావాన్లతోపాటు గౌహతి, కచ్చిబెహర్ బీదర్, బెల్గావి , మైసూర్ తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ మధ్య ట్రూజెట్ సంస్థ ఒక్కటే విమాన సర్వీసు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకూ తమసంస్థ వివిధ ప్రాంతాలకు 28,19,893 మంది ప్రయాణీకులను చేరవేసిందన్నారు.
దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమానాలు నడపడం ద్వారా దేశ విమానయాన చిత్రపటంలోకి వాటిని ఎక్కించేప్రయత్నం చేస్తొందన్నారు. జాతీయ స్ధాయిలో ఉడాన్‌తో పాటు వాణిజ్య పరమైన ప్రయాణ సౌకర్యాలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ట్రూజెట్ విమానయాన సంస్థలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎఫ్.డి.ఐ 49శాతం నిధులు సమీకరిస్తోదని తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఇంట్రప్స్ సంస్థ ఈ నిధులను తన వంతు పెట్టుబడిగా సమకూర్చనుందన్నారు. దేశంలో ఇప్పటికే 21నగరాలకు, ద్వితీయశ్రేణి పట్టణాలకు విమానయాన సేవలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ట్రూజెట్ దేశ వ్యాప్తంగా తన సేవలను విస్తరించడం కోసం ప్రణాళికలు రూపొందిస్తూ కార్యక్రమాలను విస్తరించనుందన్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన ఇంట్రప్స్ సంస్థ 49శాతం నిధులను వాటాగా పెడుతుందని డైరెక్టర్ కెవి ప్రసాద్ పేర్కొన్నారు.