వరుసగా నాలుగో రోజూ ఆగని విధ్వంసం
ఫ్రాన్స్‌లో 1311 మంది అరెస్టు …లూఠీలు, మంటలు
పారిస్ : ఫ్రాన్స్‌లో ఓ టీనేజర్ పోలీసు కాల్పుల్లో మృతి చెందడం, దీనిని పోలీసు హత్యగా నిరసన వ్యక్తం కావడంతో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు ఎక్కువగా రాత్రిపూట నిరసనకారులు వీధులలోకి వచ్చి విధ్వంసానికి పాల్పడుతున్నారు. భారీ స్థాయిలో పోలీసు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి. శనివారం 1311 మందిని అరెస్టు చేశారు. అయితే నాహేల్ అనే యువకుడి కాల్చివేత ఘటనకు వెల్లువెత్తిన నిరసనలు ఆగడం లేదు. పలు ప్రాంతాలలో దుకాణాల లూఠీలు, వాహనాలను తగులబెట్టడం , ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి పరిస్థితి గురించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన వెలువరించింది. 45000 మంది పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బ్రస్సెల్స్‌లో ఇయూ భేటీ నుంచి తిరిగొచ్చిన ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. పిల్లలను ప్రత్యేకించి టీనేజర్లను బయటకు పంపించకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదంద్రులపై ఉందని కోరారు. తెలిసో తెలియకో యువత ఉద్రిక్తతకు లోనవుతోందని, దీనిని గమనించి వారికి దేశానికి ముప్పు వాటిల్లకుండా చేసేందుకు ప్రతి ఒక్కపౌరుడు తగు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందన్నారు. కాగా పోలీసు కాల్పుల్లో మృతి చెందిన టీనేజర్ నాహేల్ అంత్యక్రియలు పారిస్ శివార్లలోని నాంటెర్రెలో జరిగేందుకు బంధువులు, స్నేహితులు సిద్ధమయ్యారు. ముందుగా దీనిని ఇక్కడ సందర్శనార్థం ఉంచారు. తరువాత దీనిని స్థానిక మసీదుకు తరువాత ఖననవాటికకు తరలించారు. ఈ దశలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు విసరడం వంటి ఘటనలతో వందలాది మంది గాయపడ్డారు. ఫ్రెంచ్ గుయానాలో ఓ బుల్లెట్ తగిలి 54 ఏండ్ల వ్యక్తి మృతి చెందారు.