Friday, December 20, 2024

నేపాల్‌లో భారీ భూకంపం.. లక్నోలో భవనం కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

నేపాల్‌లో భూకంపం..
ఒక్కరి మృతి..పలువురికి గాయాలు
ఉత్తర భారతంలో ప్రకంపనలు
హిందూకుష్ జోన్‌తో పరిణామాలు
పగుళ్ల ఉత్తరాఖండ్ దగ్గర్లోనే ప్రధాన కేంద్రం
బద్రీనాథ్ సమీపంలో ప్రకంపనల తీవ్రత
మరింత వణికిన జోషిమఠ్ సమీప ప్రాంతాలు
ఖాట్మండూ/నేపాల్: రెక్టర్ స్కేలుపై 5.8 పాయింట్ల తీవ్రతతో నేపాల్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. పలు చోట్ల భవనాలు కూలడం, ఇతరత్రా ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల దశలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడయింది. అయితే ఇది దాదాపుగా పెను భూకంపమే కావడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఓ మోస్తరు తీవ్రస్థాయి ప్రకంపనల ప్రభావం భారతదేశంలో ఉత్తరాది ప్రాంతం అంతా దాదాపుగా వ్యక్తం అయింది. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల దాదాపు 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీ, సమీప ప్రాంతాలలో ఉన్నట్లుండి భూమి కంపించడంతో జనం పరుగులు తీశారు.

5.8 తీవ్రతతో నేపాల్‌లో మధ్యాహ్నం 2.28 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని భూ ప్రకంపనల జాతీయ కేంద్రం (ఎన్‌సిఎస్) నిర్థారించింది. ఉత్తరాఖండ్‌లో ఇప్పుడు నేల పగుళ్ల భయాలు ఉన్న బద్రీనాథ్ పిత్తోరఘఢ్ ఇతర ప్రాంతాలకు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో ఈ భూ కంపం ప్రధాన కేంద్రం నమోదైందని భూ కంపాల నిపుణులు తెలిపారు. నేపాల్‌లో భూ కంప తరువాతి పరిణామాల గురించి వెంటనే వివరాలు తెలియలేదు. ఢిల్లీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీటు వెలువరించారు. జనమంతా క్షేమమని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు.

పది సెకండ్ల పాటు భూమి కంపించిందని, ఈ దశలో ఫ్యాన్లు, ఇంట్లోని వస్తువులు కంపించినట్లు ఢిల్లీ, సమీప ప్రాంతాల్లోన వారు తెలిపారు. అయితే భూకంపం వల్ల నష్టం జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటి భూకంప పరిణామం గురించి సీనియర్ భూకంప విశ్లేషకులు ఒక్కరు తెలిపారు. ఇప్పటి భూకంప కేంద్ర హిమాలయ రాపిడి ప్రాంతంలోని 2400 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ ప్రాంతం హిందూకుష్ పర్వత ప్రాంతాల నుంచి ఇప్పటి మయన్మార్ వరకూ ఉంటుంది. హిమాలయన్ రాపిడి ప్రాంతం భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంగా నిర్థారణ అయింది. దీని పరిధిలో ఉండే పలు నగరాలు పట్టణాలకు తీవ్రస్థాయి భూకంప ప్రమాదం పొంచి ఉంది. 24 గంటల వ్యవధిలో ఈ జోన్ పరిధిలో నాలుగుసార్లు భూమి కంపించింది. ఇందులో మధ్యాహ్నం తలెత్తిన భూకంపం 5.8 తీవ్రతతో ఉంది.

లక్నోలో కూలిన భవనం..ముగ్గురు మృతి
మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాదిని సెకండ్ల పాటు కుదిపేసిన భూకంపం తరువాత ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీనికి పగుళ్లు ఏర్పడటం, వెంటనే ఇది కూలడం జరిగిందని, శిథిలాల కింద దాదాపు 60 మంది వరకూ ఉన్నట్లు ప్రాధమిక సమాచారంతో వెల్లడైంది. తొలుత 8 మంది కూరుకుపోవడం జరిగిందని అధికారులు తెలిపారు. కానీ సహాయక చర్యల దశలో భవనం కింద అత్యధిక సంఖ్యలో జనం ఉన్నట్లు తెలిసింది. ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద ఊపిరాడని స్థితిలో మృతి చెందినట్లు సహాయక చర్యలను పర్యవేక్షించిన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బృజేష్ పాఠక్ తెలిపారు. ముగ్గురిని భవనం కింది నుంచి రక్షించారు.

అయితే ఈ పాత భవనం కూలడానికి భూకంపానికి ఏదైనా సంబంధం ఉందా? అనేది పూర్తిగా నిర్థారణ కాలేదని వివరించారు. ఘటనాస్థలికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బృజేష్ హుటాహుటిన అధికారులతో కలిసి వెళ్లారు. సహాయ చర్యలు పర్యవేక్షించారు. జాతీయ విపత్తు దళం కూడా ఇక్కడికి చేరుకుంది. భవనం ఉన్నట్లుండి కూలిందని ఉప ముఖ్యమంత్రి విలేకరులతో చెప్పారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ ఇతర ప్రాంతాలలో ఎక్కువగా కాలం చెల్లిన పురాతన భవనాలు ఉన్నాయి. వీటిలో చాలా మంది నివసిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూలిన భవనం అలయా అపార్ట్‌మెంట్ అని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News