యూఎన్‌ఒ అనుబంధ సంస్థ ఐఎల్‌ఒ వెల్లడి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా సుమారు 50మిలియన్‌ల ప్రజలు గతేడాది కాలంగా ఆధునిక బానిసత్వంలో బతుకుతున్నారని యూఎన్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఒ) వేసింది. కార్మిక లేదా వివాహ రూపంలో ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారని యూఎన్‌ఒ అనుబంధ సంస్థ తెలిపింది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇది అధికమని ఐఎల్‌ఒ వెల్లడించింది. బాధితుల్లో ప్రతి నలుగురులో ఒకరు లైంగిక వేధింపులకు గురువుతున్నారని, పేదలు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా పీడితుల్లో ఉన్నారని తెలిపింది. కాగా అనుబంధ సంస్థ ఐఎల్‌ఒ వలస కార్మికుల హక్కుల సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తోంది. 2021లో 28మిలియన్ మంది బలవంతంగా శ్రామికులుగా మారితే మరో 22 మిలియన్ మంది వివాహాల రూపంలో ఆధునిక బానిసత్వంలోకి అడుగుపెట్టారని ఐఎల్‌ఓ పేర్కొంది. ఈ మేరకు సోమవారం నివేదిక విడుదల చేసింది. 2017లో ప్రచురించిన నివేదికతో పోల్చితే 10మిలియన్ ప్రజలు ఆధునిక బానిసత్వంలో గడుపుతున్నారని ఐఎల్‌ఒ వెల్లడించింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్‌తోపాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, కాంగో, ఉగండా, యెమెన్‌లలో బాల్య, బలవంతపు వివాహాలు ఎక్కువయ్యాయని ఐఎల్‌ఒ గుర్తించింది. అయితే సమస్య పరిష్కరించడానికి ఆయా దేశాలు ఎటువంటి సత్వర చర్యలు తీసుకోవడం లేదని నివేదికలో పేర్కొంది. అధిక ఆదాయం, ఎగువ మధ్యతరగతి ఆదాయం ఉన్న దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు బలవంతపు వివాహ బాధితులుగా ఉన్నారు. కరోనా మహమ్మారి, మారుతున్న వాతావరణం, ఆయుధ పోరాటం కూడా పేదరికం తీవ్రమయ్యేందుకు కారణాలు అవుతున్నాయి.
సురక్షితం కాని వలసలు, లింగవివక్షతో కూడిన హింస గత కొన్నేళ్లుగా పలు రూపాల్లో బానిసత్వం పెరగడానికి కారణమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన పసిఫిక్ ప్రాంతంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బలవంతపు వివాహపు బాధితులున్నారు. అరబ్ దేశాల్లో ప్రతి వెయ్యిమందిలో ఐదుగురు బాధితులుగా నమోదవుతున్నారు. పితృస్వామ్యం, ఆచారాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో బలవంతపు వివాహాల సంఖ్య ఎక్కువగా ఉందని ఐఎల్‌ఒ తెలిపింది. 85శాతం కుటుంబ ఒత్తిడితోనే ఇవి జరుగుతున్నాయని ఐఎల్‌ఓ నివేదించింది. యూఎన్ లేబర్ ఎజెన్సీ డైరెక్టర్ జనరల్ గై రైడర్ మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారానికి ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ సంఘాలు, సామాజిక కార్యకర్తలతోపాటు సామాన్యపౌరులు కీలక పాత్ర పోషించాలన్నారు.