నలుగురు పోలీసుల సస్పెన్షన్
బులంద్‌షహర్/లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా జీత్ గర్హి గ్రామంలో కల్తీ సారా తాగి ఐదుగురు మరణించగా మరో 16 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు పోలీసు సిబ్బందిని ప్రభుత్వం సస్సెండ్ చేయగా నిందితులపై జాతీయ భద్రతా చట్టం, గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అధికారులను ఆదేశించారు.
జీత్ గర్హి గ్రామంలో బుధవారం రాత్రి కుల్దీప్ అనే వ్యక్తి నుంచి సారా కొనుగోలు చేసి తాగిన కొందరు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారని, వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా 45-60 సంవత్సరాల మధ్య వయసున్న ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఉదయం మరణించారని జిల్లా సీనియర్ ఎస్‌పి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ఆ ప్రాంతంలో గత కొంత కాలంగా సారా అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చిందని, దీంతో సికంద్రాబాద్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్‌ను, అనోఖేపురి చౌకీ ఇన్‌చార్జ్‌ను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని, అతని అనుచరులు కొందరిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు.