Friday, November 22, 2024

ఒడిశాలో డిప్తీరియాతో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఒడిశా లోని రాయగడ, కొరాపుట్, కలహండి జిల్లాల్లో డిప్తీరియా కేసులు పెరుగుతుండడం, రాయగడ జిల్లాలో గత వారం రోజుల్లో ఐదుగురు మృతి చెందడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్తీరియా వ్యాప్తికి దోహదం చేసే బ్యాక్టీరియా కొత్త వేరియంట్‌ను నిర్ధారించడానికి రోగుల నమూనాలకు జన్యుక్రమబద్ధీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి తెలిపారు. డిప్తీరియా బాధితుల నమూనాలను జన్యుక్రమబద్ధ్దీకరణ (జీనోమ్ సీక్వెన్సింగ్ )కు పంపిస్తామని పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ నీలకాంత మిశ్రా వెల్లడించారు. రాయగడ జిల్లాలో గత వారం రోజుల్లో డిప్తీరియా వల్ల నలుగురు ఇంటివద్ద, ఒకరు ఆస్పత్రిలో చనిపోయారు. రాష్ట్రంలో రాయగడ, కొరాపుట్, కలహండి జిల్లాల్లో ప్రస్తుతం 15 డిప్తీరియా కేసులు నమోదయ్యాయి. సార్వత్రిక టీకాల కార్యక్రమంలో డిప్తీరియాను ప్రభుత్వం ఎప్పుడో చేర్చింది.

దాదాపు ఈ వ్యాధి నిర్మూలనయింది కూడా. అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ లోపించడం కానీ, లేదా బ్యాక్టీరియా కొత్త వేరియంట్ ప్రభావం కానీ ఉండవచ్చని మిశ్రా పేర్కొన్నారు.రాయగడ జిల్లాలో ఇప్పుడు కొత్త కేసులు ఏవీ నమోదు కాలేదని, ఇంతవరకు చికిత్స పొందిన రోగులను డిశ్చార్జి చేయడమైందని చెప్పారు. కొరాపుట్‌కు చెందిన ఒక రోగి బర్హంపూర్ ఎంకెసిజి మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోగి న్యుమోనియాతో వెంటిలేషన్‌పై ఉన్నాడు. కలహండికి చెందిన నలుగురు డిప్తీరియాకు గురయ్యారని భావించి భవానీపట్నం ఆస్పత్రిలో చేర్చారు. వీరి స్వాబ్ నమూనాలను పరీక్ష కోసం పంపారు. డిప్తీరియా కేసులు కనుక్కోడానికి మూడు జిల్లాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులు సర్వే చేస్తున్నారు. రాయగడ కాశీపూర్ బ్లాక్ మనుష్‌పడర్ గ్రామంలో డిప్తీరియా వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ శాలినీ పండిట్ రాయగడ కలెక్టర్‌కు లేఖ ద్వారా ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News