2019లో బ్యారేజీని ప్రారంభించాక ఆపరేషన్, మెయింటనెన్స్ పట్టించుకోలేదు
బ్యారేజీ పటిష్టతకు సంబంధించిన ప్రమాణాలేవీ పాటించలేదు
2020 మే 18నే బ్యారేజీ డ్యామేజీ అయింది
దెబ్బతిన్న ప్రాంతానికి రిపేర్లు చేయలేదు
ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా ఏజెన్సీ పట్టించుకోలేదు
అగ్రిమెంట్ గడువులోపే అంచనాలు బూస్టప్
విజిలెన్స్ మధ్యంతర నివేదికలో విస్త్తుపోయే నిజాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మే డిగడ్డ కుంగుబాటు వెనుక దాగి ఉన్న కఠోర వాస్తవాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు కుంగి పోయిన బ్యారేజీ పిల్లర్లే అద్దం పట్టాయి. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన చోట నిర్మించిన మే డిగడ్డ బ్యారేజీ ద్వారా నీటిని ఎగువన నిర్మించిన అన్నారం , సుందిళ్ల బ్యారేజీలలోకి ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాలువల్లోకి గోదావరి న దీ జలాలను పారించాలన్నది ప్రధాన లక్ష్యం కాగా, అధికారుల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. బ్యారేజి డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని విజిలెన్స్ విచారణలో తేలింది. బ్యారేజి నిర్మాణం ప్రతిపాదిత గోదావరి నదీగర్భంలో బలమైన పునాదులకు పట్టులేదని తెలిసినా గుడ్డిగా డిజైన్లకు ఆమోద ముద్ర వేయించినట్టు తెలుస్తోంది.విజిలెన్స్ విచారణలో ప్రధానంగా ఐదు అంశాలు బయటకు వచ్చాయి. 2019లో బ్యారేజిని ప్రారంభించాక ఆపరేషన్, మెయింటినెన్స్‌ను ఏ మాత్రం పట్టించుకోలేదు. బ్యారేజి ప్రా రంభానికి ముందు , ఆ తరువాతా బ్యారేజి పటిష్టతకు సంబంధించిన పరీక్ష లు , ప్రమాణాలు ఏవీ పాటించలేదు. 2020మే 18నాడే బ్యారేజికి డ్యామేజి జరిగింది. దెబ్బతిన్న ప్రాంతానికి రిపేర్లు చేయలేదు. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా ఏజెన్సీ పట్టించుకోలేదు. కాఫర్‌డ్యాం , షీట్స్, పిఆర్ పిచ్చింగ్‌లు తొలగించలేదు. బ్యారేజి ఏడవ బ్లాక్‌లో 16 నుంచి 21వ పియర్స్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రాఫ్ట్ మెటీరియల్ కొట్టుకు పోయింది. త్రీడి మోడల్ స్టడీలో కీలక అంశాలు బయటపడ్డాయి. 50వ షరతు ప్రకారం కాంట్రాక్టర్లు పనులు చేయలేదు. ఐదు సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదు.
అంచనాల కనికట్టు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణదశలోనే పనుల వ్యయాలకు సంబంధించి ప్రాథమిక అంచనాలను కనికట్టు చేసినతీరు విస్మయం కలిగిస్తున్నదని విజిలెన్స్ స్పష్టం చేసింది. 1853కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన బ్యారేజిపైన ఏకంగా 2760కోట్లు అదనంగా వ్యయం చేయటం పలు సందేహాలకు తావిచ్చింది. దేశ నీటిపారుదల రంగం చరిత్రలో ఒక ప్రాజెక్టు నిర్మాదశలోనే పనులపై నిర్ణీత సమయంలోపే ఇంత పెద్ద ఎత్తున అంచనాలూ బూస్టప్ చేయటం మేడిగడ్డలోనే జరిగిందని చెబతున్నారు. గోదావరి నదీజలాలను ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్షంతో అప్పటి ప్రభుత్వం 1853.32కోట్ల ప్రాధమిక అంచనాలతో గోదావరి నదిపై మేడిగడ్డ బ్యారేజిని ప్రతిపాదించింది. ఆ తర్వాత ఈ బ్యారేజి పనులు ప్రారంభం కాకముందే అంచానాలు భారీగా పెరిగిపోయాయి. 2016 మార్చిలో బ్యారేజికి నిర్మాణం కోసం రూ.2591కోట్లతో ప్రభుత్వం పరిపాలన పరమైన ఆమోదం ఇచ్చింది. ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యాక అంచెలంచులుగా బ్యారేజి నిర్మాణ వ్యయపు అంచనాలు పెరుగుతూ పోయాయి. 2018 మే 19నాటికి బ్యారేజి నిర్మాణ వ్యయపు అంచనాలు రూ.3260కోట్లకు పేంచివేశారు. 2019 జూన్ 19న ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకాన్ని ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేసింది. అయితే ప్రాజెక్టు ప్రారంభమయ్యాక కూడా మేడిగడ్డ బ్యారేజి నిర్మాణపు అంచనాలు ఆగలేదు. మేడిగడ్డ నిర్మాణ వ్యయాన్ని 2021 సెప్టెంబర్ 6 నాటికి తాజా మదింపు పేరుతో రూ.4613కోట్లకు పెంచివేశారు. ప్రాధమిక అంచనాతో పోలిస్తే ఏకంగా 133.67శాతం అంచనాలు పెంచారు.
నిర్మాణరంగంలో పనులు జాప్యం జరిగే కొలది నిర్మాణ వ్యయభారం కూడా పెరుగుతూ వుంటుంది. స్టీలు ధరలు ,సిమెంట్ ధరలు , డీజిల్ తదితర నిర్మాణరంగంలో అవసరమయ్యే వాటి ధరలు పెరుగుతున్నందున ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం ప్రాజెక్టు వ్యయపు అంచనాలు కూడా పెంచుతుంటారు.అయితే మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిని సమయం కంటే ముందుగానే పనులు పూర్తయ్యాయి. టెండర్ల సమయంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎస్‌ఎస్‌ఆర్ రేట్లకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టు సంస్థపైన ఎక్కడా స్టీలు సిమెంట్ తదితర మెటిరియల్ ధరల అదనపు భారం పడినట్టు విజిలెన్స్ దృష్టికి రాలేదు. అయినప్పటికీ మేడిగడ్డ నిర్మాణంలో రూ.2760కోట్లు అదనంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. అంచనాల పెంపుదలకు కారణాలు ఏమిటన్నది విచారణలో తేలాల్సివుంది.
మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం సందర్భంగా అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్స్ ప్రకారం కాంటాక్టు సంస్థ పనులు నిర్వహిస్తుంది. ఆ పనులు నియమ నిబంధనల మేరకు , నిర్ణీత ప్రమాణాల మేరకు జరిగేలా చూడాల్సన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. పని చిన్నదైనా పెద్దదైనా ఇందుకోసం ప్రభుత్వం నీటిపారదుల రంగంలో క్షేత్ర స్థాయిలో ఏఇ, ఆపైన డిఇ, ఆపైన ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ పనుల తీరు,వాటి ప్రామాణికాలను కంటికి రెప్పలా కాపాడాల్సివుంటుంది. పనులను ఎస్‌ఇ పర్యవేక్షించాల్సివుంది. ఆపైన చీఫ్ ఇంజనీర్ , చిట్టచివరణ ఇఎన్‌సి మేడిగడ్డ నిర్మాణ పనుల్లో బాధ్యత వహించాల్సివుంటుంది. అంతే కాకుండ నిర్మాణాలకు ఉపయోగించే స్టీలు , సిమెంట్ , ఇసుక నాణ్యతలను ప్రయోగశాలలో పరీక్షించి అనుకూలత పొందాకా ఆ మెటీరియల్ వాడేందుకు అనుమతించాల్సివుంది. నిర్మాణం సందర్భంగా ఎప్పటికప్పుడు పనుల నాణ్యత , నిర్మాణం దృఢత్వం వంటి వాటిని క్వాలిటీ కంట్రోల్ విభాగం ద్వారా పరీక్షలు జరిపి తర్వాత పనులకు ఆమోదం తెలపాల్సింవుంది. మధ్యలో థర్డ్ పార్టీ ద్వారా పరీక్షలు ఉండనే ఉన్నాయి. అయినా మేడిగడ్డ కుంగిపోయిందంటే నిర్మాణం సందర్భంగా పనుల నాణ్యత ఉల్లంఘ న ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అసెంబ్లీకి విజిలెన్స్ మధ్యంతర నివేదిక !
కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం పనుల్లో అవినీతి ,అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి లభ్యమైన కీలక అధారాలను సేకరించి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై ఏవిధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ పథకంలో జరిగిన అక్రమాలపై సిట్టంగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపిస్తామని ప్రకటించారు. అయితే విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించలేమని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని సూచించినట్టు సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించాలా లేక నేరుగా అసెంబ్లీలోనే చర్చించాలా అన్నది నిర్ణయించనున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు లక్షకోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విజిలెన్స్ విచారణలో తేలిందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డతోపాటు అన్నారం బ్యారేజి కూడ ప్రమాదకర పరిస్థితిలోనే ఉందని విజిలెన్స్ మధ్యంతర నివేదిక వెల్లడించినట్టు పేర్కొన్నారు.