Sunday, December 22, 2024

చేనేతకు ‘మరణ’శాసనం

- Advertisement -
- Advertisement -

దేవుని పేరిట రాజకీయాలు చేసేవారిని
నిలదీయండి కులం, మతం పేరిట
రాజకీయాలు వద్దు చేసిన అభివృద్ధి
ఎంటో బిజెపి నేతలను చూపమనండి
సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ
కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల : దేవుని పేరిట ఓట్ల కోసం రాజకీయాలు చేసిసేవారిని నిలదీయాలని, వారు తెలంగాణతో సహ దేశంలో ఎక్కడైనా చేసిన అభివృద్ధి ఏమిటో చూపమనండని, చేనేతకు మరణ శాసనమైన 5శాతం జిఎస్‌టి విధించిన ప్రధాని మోడీని నిలదీసి జిఎస్‌టిని రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్లలో మంగళవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహన్ని కెటిఆర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కులం, మతం పేరిట రాజకీయాలుచేసి ఓట్ల పబ్బం గడుపుకునేవారెవరిని నిలదీయాలన్నారు. ప్రపంచానికి స్వదేశీ, ఖాదీ, చేనేత వస్త్రం అంటే ఇలా ఉంటుందని, చరఖాపై స్వయంగా నూలువడికి చూపిన మహాత్మాగాంధీ స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని మోడీ చేనేతకు మరణశాసనంగా 5శాతం జిఎస్‌టి విధించడం సిగ్గుచేటన్నారు. వెంటనే చేనేతపై 5శాతం జిఎస్‌టిని రద్దు చేయాలన్నారు. దేవుడి పేరిట చేసే రాజకీయాలకు ప్రజలు లొంగిపోద్దన్నారు.

హిందూ, ముస్లిం అనగానే ప్రజలు ఆగం కావద్దన్నారు. 8 సంవత్సరాల మోడీ పాలనలో తెలంగాణకు, సిరిసిల్లకు ఏమిచ్చారో ఆలోచించాలన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణలో 33 జిల్లాలకు 33 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారన్నారు. బిజెపి ప్రధాని మోడీ తెలంగాణకు ఒక్కటైనా విద్యాసంస్థను ఇచ్చారా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సహాయం చేయమంటే, జాతీయ హోదా ఇవ్వమంటే మొండి చెయ్యి చూపారన్నారు. ప్రతి క్షణం గుడి గుడి అనే కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ తన నియోజకవర్గంలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఏమైనా నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం సంస్కారవంతమైందని అందుకే తెలంగాణకు చెందిన పోరాట యోధులు మహనీయుల పేర్లను ఎవ్వరు అడగక పోయినా కొత్త జిల్లాలకు, విద్యాసంస్థలకు పెట్టి సమున్నతంగా గౌరవించుకుంటున్నామన్నారు. 97 సంవత్సరాలు జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్రోద్యమంలో రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. చిట్యాల చాకలి ఐలమ్మ భర్తను విస్నూరు భూస్వామి రామచంద్రారెడ్డి జైలులో పెట్టిస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ విడిపించారన్నారు. సిరిసిల్ల కొత్త చెరువు ట్యాంక్ బండ్‌పైన, కొత్త జంక్షన్ల వద్ద బద్దం ఎల్లారెడ్డి, చెన్నమనేని రాజేశ్వరరావు, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న వంటి మహోన్నతుల విగ్రహలు ప్రతిష్టించుకుందామన్నారు.

సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదాలతోనే శాసనసభ్యున్ని, మంత్రిని అయ్యానని అందుకే మీ రుణం తీర్చుకునే పనులు చేస్తున్నానన్నారు. ప్రజలు కొంత ఓపిక వహించాలన్నారు. సిరిసిల్లలో 2000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించామని, ఇండ్లు లేనివారు 3000 మంది ఉన్నారని ముందుగా పేదలకు ఇండ్లు ఇచ్చి మిగిలినవారికి ఇస్తామంటే అందరూ ముందుగా మాకే అంటే ఎలాగన్నారు. సిరిసిల్లకు కళాశాలలు, అపెరల్ పార్క్, ఫుడ్ కోర్టు, సీడ్ పార్క్ తెచ్చానని, ఉన్న టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధ్ధి చేసుకుందామన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ, సిరిసిల్ల రూపురేఖలు మారాయన్నారు. వరంగల్ జిల్లా కొడకండ్ల, జనగామ ప్రాంతంలో చేనేత కార్మికులు అధికంగా ఉండటంతో వరంగల్‌లో 1250 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెగా కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించామన్నారు. అందులో 25 వేల నుండి 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే అక్కడ కొరియా, కేరళ సంస్థల తమ పనులు ప్రారంభించాయన్నారు.

సూరత్ నుండి వచ్చిన 160 మంది చేనేత కార్మికులు వలసపోయి పారిశ్రామికులుగా తిరిగి రావడం సంతోషం కలిగించిందన్నారు. అదే స్ఫూర్తి సిరిసిల్లలో కనిపించాలన్నారు. ప్రతిపక్ష ఎంఎల్‌ఏ సీతక్క ఉన్న ములుగుకు మెడికల్ కళాశాలతోసహ అనేక సదుపాయాలు సమకూర్చి సిరిసిల్లతోపాటుగా ములుగులో కూడా హెల్త్ ప్రొఫైల్ వివరాలు సేకరిస్తున్నామన్నారు. నేతన్న బీమా పథకంలో అందరూ చేరాలని, దురదృష్టవశాత్తు ఎవరైనా నేతన్న చనిపోతే వారం రోజుల్లో ఆ కుటుంబానికి 5 లక్షలు అందుతాయన్నారు. 2004లో కెసిఆర్ సిరిసిల్ల మీదుగా ప్రయాణిస్తూ గోడల మీద ఆత్మహత్యలు వద్దు అనే రాతలు చూసి చలించిపోయి 50 లక్షల రూపాయలు విరాళాలు ప్రోగుచేసి సిరిసిల్ల ట్రస్ట్‌కు ఇచ్చారన్నారు. తెలంగాణ వచ్చాక నేతన్నలకు బడ్జెట్‌లో ఉండే రూ.70 కోట్లను 1200 కోట్ల రూపాయలకు పెంచామన్నారు. ఈ సందర్భంగా వెంకంపేట ప్రధాన రోడ్డు పనులకు శంఖకుస్థాపన చేశారు.

బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్ అభివృద్ధి పనులు, ముస్లింల గ్రేవ్ యార్డు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల, నేరెళ్లలో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలను, బస్తీ దవాఖాన, తంగళ్లపల్లిలో ఎంపిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అరుణ, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్‌పి రాహుల్ హెగ్డె, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలి సంఘం నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానికులు, అభిమానులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News