తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన గ్యారెంటీ దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఐదింటి కోసం ఒకే ఫారమ్ లో అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 28నుంచి జనవరి 6వ తేదీవరకూ జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారాలను స్వీకరిస్తారు.
ఈ దరఖాస్తులను పూర్తి చేసి, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి అధికారులకు అందజేయవలసి ఉంటుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలకు ఈ దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులలో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫారమ్ లో మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా, రెండో పేజీలో ప్రభుత్వ అభయ హస్తం గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా ఉంటుంది.