Wednesday, January 22, 2025

ఈ నెలలో పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులివే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. అయితే ఈ నెల 30 లోగా పూర్తి చేయాల్సి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్షం చేయకండి. వాటిలో రూ.2000 నోటు మార్పిడి, పాన్-ఆధార్ లింక్, డీమ్యాట్ ఖాతా నామినేషన్ వంటి ముఖ్యమైన పనుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ఇప్పుడు 14 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదే సమయంలో కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, ఈద్-ఎ-మిలాద్ వంటి అనేక పండుగలు ఈ నెలలో వస్తాయి. దీని కారణంగా సెప్టెంబరు నెలలో 16 రోజులు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి.

ఆధార్ ఉచిత అప్‌డేట్
ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయాలనుకుంటే ఈ నెలలోనే చివరి అవకాశం ఉంది. యుఐడిఎఐ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ గడువు సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. దీని తర్వాత ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ సదుపాయం జూన్ 14 వరకు ఉంది. ఆ తర్వాత మూడు నెలల పాటు పొడిగించారు. యుఐడిఎఐ ప్రత్యేకంగా 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డ్ పొంది ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోని వారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి, యుఐడిఎఐ అధికారిక వెబ్‌సైట్ మై ఆధార్‌ని సందర్శించడం ద్వారా వినియోగదారులు తమ వివరాలను స్వయంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేయలేకపోతే గడువు తర్వాత ఆధార్ కేంద్రానికి వెళ్లి ఈ పనిని పూర్తి చేయాలి, దీనికి రూ. 50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

రూ.2 వేల నోట్లను మార్పిడి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) మే 19న 2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. 2000 నోట్లను మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్ దేశప్రజలకు 4 నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. బ్యాంకులో నోట్లను మార్చడానికి ఎలాంటి పత్రాలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.

ఆధార్-పాన్‌ను లింక్
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే సెప్టెంబర్ 30 లోపు చేయండి. గడువు లోగా చేయకపోతే మీ పాన్ ఇన్-యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత పాన్‌కు సంబంధించిన పనులు ఆగిపోతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సిబిడిటి) 2022 జూన్ 30 నుండి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1,000 ఆలస్య ఫీజును వసూలు చేస్తోంది.

బ్యాంకు సెలవులు
ఆర్‌బిఐ ప్రకారం, సెప్టెంబర్ నెలలో 4 ఆదివారాలు, 2 శనివారాలు అంటే 6 రోజులు బ్యాంకులు మూసివేస్తారు. ఇతర కారణాల వల్ల మరో 10 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సెలవులు కూడా కలిపితే బ్యాంకులు 16 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అందువల్ల ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటే, ముందుగానే సెలవుల జాబితాను తనిఖీ చేయండి. తర్వాత మాత్రమే బ్యాంకుకు వెళ్లండి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డీమ్యాట్ ఖాతా నామినేషన్
డీమ్యాట్ ఖాతా ద్వారా షేర్లలో పెట్టుబడి పెట్టే వ్యక్తులు నామినేషన్ దాఖలు, నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలి. నిర్ణీత గడువులోగా నామినేషన్ చేయకపోతే, ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు స్తంభింపజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News