టీమిండియాకు షాక్
ఐసోలేషన్‌కు ఐదు క్రికెటర్లు, నిబంధనల ఉల్లంఘనపై దర్యాప్తు
మెల్‌బోర్న్: మూడో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించారు. బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించి ఐదుగురు ఆటగాళ్లు హోటల్‌లో భోజనానికి వెళ్లారు. దీంతో ఈ క్రికెటర్లను నిర్వాహకులు ఐసోలేషన్‌కు తరలించారు. మరోవైపు క్రికెటర్లు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించారో లేదో క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు బిసిసిఐ విచారణకు ఆదేశించారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే క్రికెటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, సైని, శుభ్‌మన్ గిల్, పృథ్వీషా తదితరులు మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. ఇక అక్కడే ఉన్న ఓ భారత అభిమాని క్రికెటర్లకు సంబంధించిన బిల్లును చెల్లించాడు. బిల్లు చెల్లించిన విషయంతో పాటు భారత క్రికెటర్లతో దిగిన ఫొటోను ఆ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో క్రికెటర్లు హోటల్‌కు వెళ్లిన విషయం బయటపడింది. ఇదిలావుండగా హోటల్‌కు వెళ్లిన క్రికెటర్లను జట్టుకు దూరంగా ఉంచారు. ప్రస్తుతం ఐదుగురు ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం వీరంతా జట్టుకు దూరంగా ఉండక తప్పదు. ఇదే జరిగితే టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి. మెల్‌బోర్న్ టెస్టులో చారిత్రక విజయం సాధించి జోరుమీదున్న భారత్‌కు ఈ ఉదంతం షాక్‌కు గురి చేసింది. కీలక ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంఘించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
5 Indian Cricketers put in Isolation as Covid Protocol